ఆహారం.. అభద్రత!

24 Jan, 2015 00:55 IST|Sakshi

ఎన్డీయే సర్కారు వచ్చాక జోరందుకున్న సంస్కరణల సెగ ఇప్పుడు రైతాంగంపైనా, పేద వర్గాలపైనా పడే ఛాయలు కనిపిస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత, ఎంపీ శాంతకుమార్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నాలుగురోజుల నాడు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యవసాయరంగం, ఆహారభద్రత అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ సమర్పించిన నివేదిక అలజడి సృష్టిస్తున్నది.
 
 ఇప్పుడు ఆహార భద్రతా చట్టం పరిధిలో ఉన్న నిరుపేదలను 67 శాతంనుంచి 40 శాతానికి తగ్గించాలని... ఇప్పటివరకూ కేవలం భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) మాత్రమే నిర్వహిస్తున్న ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ వంటి  అంశాల్లో ప్రైవేటు సంస్థలకు కూడా చోటివ్వాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. రైతులకిస్తున్న కనీస మద్దతు ధరనైనా, పేదలకిచ్చే సబ్సిడీలైనా ఇకపై నగదు బదిలీ విధానం ద్వారా ఆ వర్గాలకు నేరుగా డబ్బు రూపంలో అందజేయాలని కూడా సూచించింది.
 
 ఇలా నగదు బదిలీ విధానం అమలు చేస్తే ప్రభుత్వం ఏటా రూ. 33,000 కోట్లు ఆదా చేయొచ్చని...ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణీ వంటివాటికయ్యే ఖర్చులన్నీ కలిసొస్తాయని ఆ కమిటీ అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో ఎఫ్‌సీఐ ధాన్యసేకరణను పూర్తిగా నిలిపేయాలని... ఆ పనిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చేపట్టాలని కమిటీ ప్రతిపాదించింది.
 
 ఇలాంటిదేదో ఉరుము లేని పిడుగులా వచ్చిపడుతుందని పౌర సమాజం కార్యకర్తలు కొంతకాలంగా చెబుతూనే ఉన్నారు. ప్రణాళికా సంఘం స్థానంలో ఇప్పటికే కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ఎన్డీయే సర్కారు తదుపరి ఎజెండా ఎఫ్‌సీఐ పునర్వ్యవస్థీకరణేనని వారు అంటూనే ఉన్నారు. మొన్నటి ఆగస్టులో ఏర్పాటైన శాంతకుమార్ కమిటీ పరిశీలనాంశాల్లో ఆహారభద్రతతోపాటు ఎఫ్‌సీఐ పునర్వ్యవస్థీకరణ కూడా ఉంది.
 
 దేశంలో రైతుల, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి... మార్కెట్‌ను నియంత్రించడానికి 1964లో ఎఫ్‌సీఐను ఏర్పాటు చేశారు. తిండిగింజలకు కేంద్రం నిర్ణయించే కనీస మద్దతు ధర ప్రాతిపదికన రైతులవద్దనుంచి కొనడం...వాటిని నిల్వచేసి, నిరుపేద వర్గాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందుబాటులో తెచ్చేందుకు తోడ్పడటం ఆ సంస్థ ఏర్పాటు వెనకున్న ఉద్దేశం. అలాగే దేశ ఆహార భద్రతావసరాలను తీర్చడం కోసం ఎప్పటికప్పుడు తగిన స్థాయిలో నిల్వలుండేలా చూడటం కూడా దాని పనే. రైతుల నుంచి మిల్లర్లు సేకరించే ధాన్యం మరపట్టాక అందులో 75 శాతాన్ని ఎఫ్‌సీఐ లెవీగా సేకరిస్తున్నది. ఈ విధానం కింద మిగిలిన 25 శాతాన్ని మిల్లర్లు బహిరంగ విపణిలో అమ్ముకోవచ్చు. దీన్ని 25 శాతానికి పరిమితం చేయాలని మొన్న ఆగస్టులోనే కేంద్రం నిర్ణయించింది. రాగల సంవత్సరాల్లో లెవీ సేకరణ ఈమాత్రం కూడా ఉండబోదన్న సంకేతాలిచ్చింది. అంతేకాదు... తాము ప్రకటించే కనీస మద్దతు ధరకు బోనస్ ప్రకటించే సంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలని స్పష్టంచేసింది. వాస్తవానికి ఇలాంటి విధానాలు ఇప్పుడు ఎన్డీయే సర్కారు కొత్తగా ఆలోచించినదేమీ కాదు. గత యూపీఏ ప్రభుత్వం కూడా ఇదే తోవన వెళ్లడానికి కొంత ప్రయత్నం చేసింది. కానీ, కాలం కలిసిరాకపోవడంతో దాన్ని వాయిదా వేసుకుంది.
 
 ఎఫ్‌సీఐ నిర్వహణా తీరులో లోపాలు లేవని ఎవరూ అనలేరు. ఆ సంస్థ నిర్వహణను వికేంద్రీకరిస్తేనే అటు రైతులకూ, ఇటు పేదలకూ ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కేంద్రీకృత సేకరణ, ఆహార ధాన్యాల నిల్వవంటివి అనవసర శ్రమతో కూడుకుని ఉన్నవే కాక భారీ వ్యయంతో ముడిపడి ఉంటాయన్నది వీరి విమర్శ. స్థానికంగా సేకరించే ఆహారధాన్యాలను ఆయా ప్రాంతాల్లోనే నిల్వ చేసే విధానాన్ని అనుసరిస్తే చాలా సమస్యలు తీరుతాయని, రైతులనుంచి గోడౌన్లకూ.... అక్కడినుంచి మళ్లీ వినియోగదారులకూ చేర్చడానికయ్యే వ్యయం కలిసొస్తుందని నిపుణుల అభిప్రాయం.
 
 ఇక రైతులకు కనీస మద్దతు ధర చెల్లించడం కోసమని ఎఫ్‌సీఐ బ్యాంకులనుంచి తీసుకునే రుణాలు, వాటిని చెల్లించడంలో జరిగే జాప్యం ఈ వ్యయాన్ని ఇంతకింతా పెంచేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఆహార ధాన్యాల సేకరణలో ఎఫ్‌సీఐ ఎక్కడలేని బద్ధకాన్నీ ప్రదర్శిస్తున్నది. గోడౌన్లు ఖాళీ లేవన్న సాకు చూపి కొనుగోళ్లను కుదిస్తున్నది. ఫలితంగా మిల్లర్లు, కమిషన్ ఏజెంట్లు, దళారుల పాలబడి రైతులు విలవిల్లాడుతున్నారు. నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇలాంటి  సమస్యలను పరిష్కరించడానికి బదులుగా ఇటు రైతులను దెబ్బతీసేలా... అటు నిరుపేద జనానికి తిండిగింజలు చవగ్గా అందుబాటులోకి రాకుండా చేసే చర్యలు చివరకు ఏ పర్యవసానాలకు దారితీస్తాయో శాంతకుమార్ కమిటీ గుర్తించినట్టు లేదు.
 
యూపీఏ సర్కారు ఆహార భద్రతపై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ దాన్ని వ్యతిరేకించలేదు. సరిగదా...తాము అధికారంలోకొచ్చాక దీన్ని మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీకి భిన్నంగా ఇప్పుడు ఆహార భద్రతా చట్టం పరిధిలోకొచ్చే పేదల సంఖ్యను కుదించడానికి పూనుకున్నట్టు కనబడుతున్నది. మరో రెండురోజుల్లో 65వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్న మన రిపబ్లిక్‌లో 67 శాతం మంది... అంటే 82 కోట్లమంది జనం ఇంకా పేదలుగా ఉన్నారని ఒప్పుకోవడం ప్రభుత్వాలకు ఇబ్బందికరమైన విషయమే. ఏటా ఎన్నో పథకాలకింద వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా పరిస్థితి మారలేదని ఒప్పుకోవడమే. అయితే, పేదలను కుదించడం దీనికి పరిష్కారం కాదు. వివిధ పథకాలను సమర్థవంతంగా అమలుచేసి, అవసరమనుకుంటే మరిన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టి ఈ స్థితిని మార్చాలి. కానీ, ‘రోగం ఒకటైతే మందు మరోటి’ అన్న చందంగా శాంతకుమార్ కమిటీ సిఫార్సులున్నాయి. రైతాంగాన్ని, నిరుపేద జనాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే ఇలాంటి సిఫార్సులను శిరోధార్యంగా భావించడం చేటు కలిగిస్తుందని కేంద్రం గుర్తించాలి.

మరిన్ని వార్తలు