ధరలు పెంచవద్దన్న ఆదేశాలు లేవు 

12 Apr, 2018 01:02 IST|Sakshi

వెల్లడించిన పెట్రోలియమ్‌ కంపెనీలు  

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌ ధరలను పెంచవద్దంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ కంపెనీలు స్పష్టం చేశాయి. వచ్చే నెలలో కర్ణాటకలో ఎన్నికలు ఉన్నందున ఇంధనాల ధరలు పెంచవద్దంటూ కేంద్రం నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని ఈ రెండు కంపెనీల అధినేతలు స్పష్టం చేశారు. 

నష్టాల్లో ఆయిల్‌ షేర్లు...: సిరియాపై దాడి, తదనంతర పరిణామాలతో పశ్చిమాసియా రాజకీయాలు వేడెక్కడం, అమెరికాలో చమురు నిల్వలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్‌ బ్యారెల్‌ చమురు ధర నాలుగేళ్ల గరిష్టానికి, 71 డాలర్లకు ఎగియడంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల (ఓఎమ్‌సీ) షేర్లు నష్టపోయాయి. ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, ఎన్నికల సంవత్సరం కావడంతో పెట్రోలియం ఇంధన ధరలు పెంచవద్దని ఓఎమ్‌సీలను ప్రభుత్వం ఆదేశించిందన్న వార్తల కారణంగా  హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ షేర్లు 8 శాతం వరకూ పతనమయ్యాయి. మరోవైపు చమురు ఉత్పత్తి కంపెనీలు ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాలు చెరొక శాతం  లాభపడ్డాయి.  

చమురు ధరల పెరుగుదల భారత్‌కు మంచిదికాదు: ఐఈఏ 
చమురు ధరల పెరుగుదల భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఈడీ బిరోల్‌ బుధవారం పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన 16వ అంతర్జాతీయ ఇంధన సదస్సులో మాట్లాడుతూ.. చమురు ధరల పెరుగుదల దిగుమతులపై ఆధారపడుతున్న భారత్‌కు ఇది మరీ ప్రతికూలమనీ వ్యాఖ్యానించారు. ఇక చమురు ఉత్పాదక దేశాల పరంగా చూస్తే, దీర్ఘకాలంలో ఆయా దేశాల ఆర్థిక స్థిరత్వానికి చమురు ధరల భారీ పెరుగుదల మంచిదికాదన్నారు.  

మరిన్ని వార్తలు