3 రోజుల ఆఫీసు మనకు తగదు..

4 Aug, 2014 05:06 IST|Sakshi

న్యూఢిల్లీ: వారానికి మూడు రోజులే ఆఫీసు... రోజుకు 11 గంటల పని... ఈ పద్ధతి పాటిస్తే ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతుందంటున్నారు అంతర్జాతీయ ప్రముఖులు. ప్రపంచంలో రెండో అత్యధిక ధనవంతుడు, మెక్సికోకు చెందిన స్లిమ్ కార్లోస్, సుప్రసిద్ధ బ్రిటిష్ వాణిజ్యవేత్త రిచర్డ్ బ్రాన్సన్ తదితరులు ఈ కొత్త పద్ధతిపై అమితాసక్తి చూపుతున్నారు. ‘వారానికి మూడు రోజుల పని, నాలుగు రోజులు సెలవులుండడమే మంచిది.

వారానికి ఐదారు రోజులకు బదులు రోజుకు 11 గంటల చొప్పున మూడు రోజులు పనిచేస్తే ఉత్పాదకత పెరుగుతుంది..’ అని వారు చెబుతున్నారు. భారతీయ విశ్లేషకులు మాత్రం ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నారు. అనేక రకాల పరిశ్రమలు, ఉద్యోగాల్లో ఈ మోడల్ ఆచరణ సాధ్యం కాదని అంటున్నారు. ‘రోజుకు 11 గంటల పని అంటే రన్నింగ్ రేసు వంటిదే. కస్టమర్ సర్వీసు, రిటైల్, ఎంటర్‌టైన్‌మెంట్, హెల్త్‌కేర్ వంటి రంగాలకు కొత్త పద్ధతి అనువుగా లేదు.

ఉత్పాదకత కీలకమైన వర్ధమాన దేశాల్లో మరిన్ని ఉద్యోగాలు కల్పించాల్సిఉంది. అందుకే, ఈ పద్ధతి భారత్‌కు తగినట్లుగా లేదు’ అని శాప్ ల్యాబ్స్ ఇండియా హెచ్‌ఆర్ హెడ్ టి.శివరామ్ చెప్పారు. ‘కొత్త మోడల్‌లో ఉద్యోగులు వారానికి 33 గంటలే పనిచేస్తారు. గంటల లెక్కన జీతం చెల్లిస్తారు. వారానికి 40 గంటల పనితో పోలిస్తే ఉద్యోగులకు వేతనాలు తగ్గుతాయి. ఆ లోటు పూడ్చుకోవడానికి మరో ఉద్యోగం వెతుక్కోవాలి’ అని అంటాల్ ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ మేనేజింగ్ పార్ట్‌నర్ జోసెఫ్ దేవాసియా పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు