మొండి బకాయిల్లో యునెటైడ్ బ్యాంక్ టాప్

29 Jun, 2015 01:43 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో  యునెటైడ్ బ్యాం క్ ఆఫ్ ఇండియాకు అత్యధికంగా మొండి బకాయిలు ఉన్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఆర్థిక మంత్రిత్వ శాఖకు నివేదించిన వివరాల ప్రకారం..., ఈ ఏడాది మార్చి నాటికి యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు  21.5 శాతం రుణాలు మొండి బకాయిలు(పునర్వ్యస్థీకరించిన రుణాలను కూడా కలుపుకొని)గా  ఉన్నాయి. ఈ తరహా రుణాలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 21.3 శాతంగా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు 19.4 శాతంగా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌కు 18.7 శాతంగా, పంజాబ్  నేషనల్ బ్యాంక్‌కు 17.9 శాతంగా ఉన్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, అలహాబాద్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూకో, దేనా బ్యాంక్‌లకు ఈ తరహా రుణాలు 15 శాతానికి పైగానే ఉన్నాయి. మొండి బకాయిలు పెరగడం ఆర్‌బీఐని, ప్రభుత్వానికి కూడా ఆందోళన కలిగిస్తోంది. వీటిని తగ్గించడానికి ఆర్‌బీఐ పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండి బకాయిలు రూ.2,55,180 కోట్లు. వీటిలో 30%(రూ.93,769 కోట్లు) టాప్-30 డిఫాల్టర్లవే.

మరిన్ని వార్తలు