20 నెలల గరిష్టానికి రూపాయి

7 Apr, 2017 00:56 IST|Sakshi
20 నెలల గరిష్టానికి రూపాయి

35 పైసల లాభంతో 64.52 వద్ద ముగింపు
ముంబై: రూపాయి జోరు కొనసాగుతోంది. గురువారం రూపాయితో డాలర్‌ మారకం 35 పైసలు లాభపడి 64.52 వద్ద ముగిసింది. 2015, ఆగస్టు 11 తర్వాత రూపాయికి ఇదే గరిష్ట స్థాయి. ఆ రోజు రూపాయి 64.19కు ఎగసింది. ఆర్‌బీఐ పాలసీలో భాగంగా భారత వృద్ధి జోరుగా ఉండనున్నదని అంచనాలు వెలువడడంతో ఎగుమతిదారులు భారీగా డాలర్లను  విక్రయించారని విశ్లేషకులు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం వృద్ధి సాధించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలు 7.4 శాతమని ఆర్‌బీఐ పేర్కొంది. స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ఉండడం, ఆర్‌బీఐ పాలసీని ప్రకటించకముందు తీవ్రమైన ఒడిదుడుకులకు రూపాయి గురైంది. చివర్లో ఆశ్చర్యకరమైన రీతిలో పుంజుకొని 20 నెలల గరిష్ట స్థాయికి చేరింది.

ఫారెక్స్‌ మార్కెట్లో బుధవారం నాటి ముగింపు(64.87)తో పోల్చితే గురువారం రూపాయితో డాలర్‌ మారకం 65.05 వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో ట్రేడింగ్‌ ఎక్కువ సమయం నష్టాల్లోనే సాగింది. ఆర్‌బీఐ జీడీపీ అంచనాలను వెల్లడించగానే రూపాయి రికవరీ బాట పట్టింది. ఇంట్రాడేలో తాజా గరిష్ట స్థాయి 64.50ను తాకింది. చివరకు 35 పైసల లాభంతో 64.52 వద్ద  ముగిసింది.

మరిన్ని వార్తలు