వేదాంత లాభం 34% డౌన్‌

8 May, 2019 00:44 IST|Sakshi

క్యూ4లో రూ.2,615 కోట్లు  

12% తగ్గిన మొత్తం ఆదాయం  

పూర్తి అయిన పునర్వ్యవస్థీకరణ  

న్యూఢిల్లీ: లోహ, మైనింగ్‌ దిగ్గజం వేదాంత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో 34 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017–18) క్యూ4లో రూ.3,956 కోట్లుగా  ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,615 కోట్లకు తగ్గిందని వేదాంత తెలిపింది. ఆదాయం తక్కువగా రావడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వేదాంత లిమిటెడ్‌ చైర్మన్‌ నవీన్‌ అగర్వాల్‌ తెలిపారు.  మొత్తం ఆదాయం రూ.28,547 కోట్ల నుంచి 12 శాతం క్షీణించి రూ.25,096 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు.  మొత్తం వ్యయాలు కూడా రూ. 22,824 కోట్ల నుంచి రూ.20,992 కోట్లకు తగ్గాయని వివరించారు. ఎబిటా 20 శాతం తగ్గి రూ.6,135 కోట్లకు, ఎబిటా మార్జిన్‌ 1.7 శాతం తగ్గి 26.1 శాతానికి చేరాయి.  

గత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి పునర్వ్యవ స్థీకరణ జోరుగా జరిగిందని, ఆర్థిక అంశాలు పటిష్టంగా ఉన్నాయని, వాటాదారులకు పరిశ్రమలోనే ఏ కంపెనీ ఇవ్వనంతటి రాబడులు ఇచ్చామని అగర్వాల్‌ పేర్కొన్నారు. తాము కొనుగోలు చేసిన ఎలక్ట్రోస్టీల్‌ స్టీల్స్‌ కంపెనీని విజయవంతంగా లాభాల బాట పట్టించామని తెలిపారు.  విభిన్నమైన  సహజ వనరుల వ్యాపారాలకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటిగా అవతరించామని కంపెనీ సీఈఓ శ్రీనివాసన్‌ వెంకటకృష్ణన్‌ చెప్పారు.  ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ స్థూల రుణ భారం రూ.8,066 కోట్లు పెరిగి రూ.66,225 కోట్లకు ఎగసిందని శ్రీనివాసన్‌ వివరించారు. నికర రుణ భారం రూ.5,000 కోట్లు పెరిగి రూ.26,956 కోట్లకు చేరిందని పేర్కొన్నారు.    మార్కెట్‌ ముగిసిన తర్వాత వేదాంత కంపెనీ ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. బీఎస్‌ఈలో వేదాంత షేర్‌ 2 శాతం నష్టంతో రూ.163 వద్ద ముగిసింది.   

మరిన్ని వార్తలు