ఈ ఏడాది 10% అధికంగా ఉత్పత్తి: వైజాగ్ స్టీల్

5 Nov, 2014 02:42 IST|Sakshi
ఈ ఏడాది 10% అధికంగా ఉత్పత్తి: వైజాగ్ స్టీల్

న్యూఢిల్లీ: హుద్‌హుద్ తుపాన్ 10 రోజులపాటు  ఉత్పత్తికి అంతరాయాన్ని కల్పించినప్పటికీ ఈ ఏడాది 10% వృద్ధిని సాధించగలమన్న ఆశాభావాన్ని ఆర్‌ఐఎన్‌ఎల్(వైజాగ్ స్టీల్) వ్యక్తం చేసింది. వెరసి గత ఆర్థిక సంవత్సరం(2013-14)తో పోలిస్తే 10% అధికంగా 3.5 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేయగలమని అంచనా వేసింది.

హుద్‌హుద్ కారణంగా అక్టోబర్ 12 నుంచి పది రోజులపాటు ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ, ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరుగుతున్నదని కంపెనీ చైర్మన్ పి.మధుసూదన్ చెప్పారు. గతేడాది కంపెనీ చరిత్రలో కొత్త రికార్డును సృష్టిస్తూ 3.2 మిలియన్ టన్నుల సేలబుల్ స్టీల్‌ను ఉత్పత్తి చేసిన విషయం విదితమే. తుపాన్ ప్రభావం తరువాత కంపెనీ దశలవారీగా ఉత్పత్తి కార్యక్రమాలను మొదలుపెట్టింది. కాగా, ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో(ఏప్రిల్-అక్టోబర్) 1.86 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేసింది. గతేడాది ఇదే కాలంలో 1.77 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసింది.

మరిన్ని వార్తలు