ఐదేళ్లలో 50 హోల్‌సేల్ స్టోర్లు

9 Apr, 2014 01:02 IST|Sakshi
ఐదేళ్లలో 50 హోల్‌సేల్ స్టోర్లు

న్యూఢిల్లీ: భారత్‌లో సొంతంగా కార్యకలాపాల విస్తరణకు అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రధానంగా క్యాష్ అండ్ క్యారీ(హోల్‌సేల్) విభాగంపై దృష్టిసారించిన ఈ సంస్థ... వచ్చే 4-5 ఏళ్లలో 50 వరకూ ఈ తరహా స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. భారతీ గ్రూప్‌తో భాగస్వామ్యంతో దేశంలోకి ప్రవేశించిన వాల్‌మార్ట్.. బెస్ట్‌ప్రైస్ మోడల్ హోల్‌సేల్ బ్రాండ్ పేరుతో స్టోర్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఆరు నెలల క్రితం భారతీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత మళ్లీ ఇప్పుడు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. భారత్‌లో కార్యకలాపాల కోసం ముడుపులు ముట్టజెప్పిందన్న ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో తమ వ్యాపార విధానాల నిబద్ధతను మరింత పటిష్టం చేయనున్నట్లు కూడా పేర్కొంది. ఆరేళ్లపాటు భారతీతో కలిసి  దాదాపు 20 స్టోర్లను నిర్వహించిన వాల్‌మార్ట్... ఆ సంస్థతో విడిపోయాక ప్రకటించిన కీలక వ్యాపార వృద్ధి ప్రణాళికలు ఇవే కావడం గమనార్హం.

 మల్టీబ్రాండ్ రిటైల్ ప్రణాళికలపై మౌనం...
 ‘భారత్‌లో పెట్టుబడులకు మేం కట్టుబడి ఉన్నాం. ఇక్కడ వ్యాపార వృద్ధి ప్రణాళికల విషయంలోనూ చాలా ఉత్సుకతతో ముందుకెళ్తున్నాం. ప్రధానంగా క్యాష్ అండ్ క్యారీ విభాగంలో మా ప్రస్థానం కొనసాగుతుంది. గడిచిన కొన్నేళ్లలో ఇక్కడ రిటైల్ రంగంలో వచ్చిన మార్పుల పట్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విభాగంలో మరింత భారీ వృద్ధికి అవకాశాలున్నాయి. అందుకే రానున్న 4-5 ఏళ్లలో కొత్తగా 50 క్యాష్ అండ్ క్యారీ స్టోర్లను ఏర్పాటు చేయనున్నాం. మా కస్టమర్లకు మరింత చేరువయ్యేలా... వర్చువల్ షాపింగ్ అవకాశాన్ని కల్పించేందుకు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను కూడా విస్తరించనున్నాం’ అని వాల్‌మార్ట్ ఏషియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ స్కాట్ ప్రైస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరఫరా మౌలికవసతులు, సరఫరాదారుల అభివృద్ధికి సంబంధించి కూడా పెట్టుబడులపైనా కంపెనీ దృష్టిసారిస్తోంది. అయితే, భారత్‌లో మల్టీబ్రాండ్ రిటైల్ విభాగంలోకి ఎప్పుడు ప్రవేశిస్తారన్న అంశంపై వివరాలను మాత్రం వాల్‌మార్ట్ వెల్లడించలేదు.

మరిన్ని వార్తలు