ఇల్లంతా ‘ఎంఐ’ మయం..!

28 Dec, 2018 02:50 IST|Sakshi

నూతన విభాగాలపై షావోమీ కన్ను

ఫోన్లు, టీవీలతో పాటు ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు

త్వరలో వ్యాక్యూమ్‌ క్లీనర్లు, వాటర్‌ ప్యూరిఫయర్లలోకి

ప్రణాళికల రచనలో కంపెనీ ఉన్నత ఉద్యోగులు  

న్యూఢిల్లీ: చేతిలో ఎంఐ ఫోన్‌... హాల్లో ఎంఐ ఫ్రిజ్‌... కిచెన్‌లో ఎంఐ వాటర్‌ ప్యూరిఫయర్‌... బాల్కనీలో ఎంఐ వాషింగ్‌ మెషిన్‌... బెడ్‌ రూమ్‌లో ఎంఐ ఏసీ... భవిష్యత్తులో ఇదే చూడబోతున్నాం!. చౌక ధరలకే అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎంఐ బ్రాండ్‌ స్మార్ట్‌ ఫోన్లతో భారతీయులకు చేరువైన చైనా కంపెనీ ‘షావోమీ’... భారత మార్కెట్లో మరింతగా పాతుకుపోయే ప్రణాళికలను రచిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ నుంచి పూర్తి స్థాయి కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీగా అవతరించనుంది. షావోమీ ఉన్నత స్థాయి ఉద్యోగ బృందం ప్రస్తుతం ఇదే పనిలో ఉంది. భారత మార్కెట్లో భారీ వృద్ధికి అవకాశం ఉన్న ఎయిర్‌కండిషనర్లు, వాషింగ్‌ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, వ్యాక్యూమ్‌ క్లీనర్లు, వాటర్‌ ప్యూరిఫయర్ల విభాగాల్లో ఉత్పత్తులను తీసుకురావడంపై షావవోమీ దృష్టి సారించినట్టు సమాచారం. అన్ని ఉత్పత్తులను కూడా ఇంటర్నెట్‌ ఆధారితంగా నియంత్రించేందుకు (ఐవోటీ) వీలుండే స్మార్ట్‌గానే ఉంటాయని, రిమోట్‌గా వీటిని నియంత్రించుకోవచ్చని కంపెనీ ఉద్యోగులు తెలిపారు.

వృద్ధి అవకాశాలు...  
భారత మార్కెట్లో షావోమీ ఏటా 100 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది. కొత్త విభాగాల్లోకి ప్రవేశించడం ద్వారా మరింత వృద్ధి అవకాశాలను సొంతం చేసుకోవాలన్నది కంపెనీ ఆలోచన. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో తీవ్ర పోటీ కారణంగా ఈ ఒక్క విభాగమే శాశ్వతం కాదనుకుని అదనపు వృద్ధి అవకాశాలపై కంపెనీ దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. నిజానికి షావోమీ ఇప్పటికే భారత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్లు, ఎయిర్‌ ప్యూరిఫయర్లు, టీవీలతోపాటు మరికొన్ని గ్యాడ్జెట్లను కూడా విక్రయిస్తోంది. స్మార్ట్‌ టెలివిజన్ల విభాగంలో వచ్చే ఏడాది మరిన్ని ఉత్పత్తులను తీసుకురానుంది. షావోమీ ప్రస్తుతం తన ఉత్పత్తులను తొలుత ఆన్‌లైన్‌లో విడుదల చేసి, తర్వాత ఎంఐ స్టోర్లలో అందుబాటులోకి తెస్తోంది. ఇకపై పెద్ద ఎలక్ట్రానిక్, మొబైల్‌ రిటైల్‌ స్టోర్లలోనూ తన ఉత్పత్తులను అందుబాటులోకి తేనుందని పరిశ్రమకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు.  

ఆఫ్‌లైన్లో భారీ విస్తరణ...
షావోమీ దేశవ్యాప్తంగా కొత్తగా 500 పట్టణాల్లోకి వచ్చే ఏడాది తన కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికతో ఉంది. ప్రస్తుతం కంపెనీ దేశంలోని టాప్‌ 50 పట్టణాలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. షావోమీ ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశ స్మార్ట్‌ టెలివిజన్‌ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రధాన కంపెనీలైన శామ్‌సంగ్, సోనీ, ఎల్‌జీ ఉత్పత్తులతో పోలిస్తే 30–50 శాతం చౌక ధరలకే ఆఫర్‌ చేయడం ద్వారా వాటికి గట్టి సవాల్‌ విసిరింది. తొలుత ఆన్‌లైన్‌లో ఆరంభించిన విక్రయాలను తర్వాత ఎంఐ స్టోర్లకు విస్తరించింది. స్థానిక కంపెలతో తయారీ ఒప్పందాలను చేసుకుంది. ఇదే తరహాలో హోమ్‌ అప్లయన్సెస్‌ విభాగంలోనూ మరిన్ని ఉత్పత్తులతో చొచ్చుకుపోవాలన్నది కంపెనీ వ్యూహం. ప్రధాన కంపెనీలకు దీటుగా ఫీచర్లన్నింటినీ ఇస్తూ, ధరల పరంగా చౌకగా అందుబాటులోకి తీసుకురావడం ఎంఐ విజయసూత్రంగా ఉంది. 

మరిన్ని వార్తలు