బీమాకు యుక్త వయసే కరెక్ట్‌!

3 Apr, 2017 00:19 IST|Sakshi
బీమాకు యుక్త వయసే కరెక్ట్‌!

ఎప్పుడు ఏం జరుగుతుందో మన చేతుల్లో ఉండదు
త్వరగా ప్రారంభిస్తే ప్రీమియం కూడా తక్కువ  


జీవితం మన చేతుల్లో ఉండదు. ఏదీ అనుకున్నట్టు జరగదు కూడా. దీన్నెప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. గతేడాది నవంబర్‌లో ఇండోర్‌– పాట్నా రైలు ప్రమాదం జరిగింది... గుర్తుందా? ఇందులో ప్రాణాలు కోల్పోయిన 120 మందిలో ఓ ఇద్దరు యువకుల గురించి తెలుసుకోవాలి. వీరు గతేడాది ప్రారంభంలోనే కొత్తగా ఉద్యోగంలో చేరారు. ఒకసారి ఆలోచించండి. వారి కుటుంబాలు వారిపై ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటాయో? సంపాదించే కొడుకులను పోగొట్టుకున్న ఆ కుటుంబాల కలలు కల్లలయ్యాయి. అయితే ఇద్దరిలో ఒక వ్యక్తి మాత్రం ఉద్యోగంలో చేరిన వెంటనే జీవిత బీమా పాలసీ తీసుకున్నాడు. మరో వ్యక్తి అప్పుడే బీమా ఎందుకులే... అని తన సంపాదనను ఇతర ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాల్లో పెట్టుబడి పెట్టడం ఆరంభించాడు. ఇప్పుడు ఎవరి కుటుంబం సంతోషంగా ఉందో మీకు ఆర్థమయ్యే ఉంటుంది!!.

జీవిత బీమా కూడా ఆర్థిక సాధనమే..
సంపాదన ప్రారంభించిన దగ్గరి నుంచే ఇన్వెస్ట్‌ చేయాలి. ప్రస్తుతం మార్కెట్‌లో పలు రకాల ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిల్లో ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలనే సందేహం చాలా మందికి ఉంటుంది. కేవలం కుటుంబం కలిగిన వారు మాత్రమే ఇన్వెస్ట్‌ చేయాలని అనుకోకూడదు. పెళ్లి కాకుండా ఒంటరిగా ఉన్నా కూడా ఇన్వెస్ట్‌ చేయాలి. ఎంత వీలైతే అంత త్వరగా ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభించాలి. అప్పుడే చివరిలో ఎక్కువ ప్రయోజనం పొందగలం. ఇక్కడ జీవిత బీమాను కూడా ఆర్థిక సాధనంగానే చూడాలి. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ ప్రకారం... దేశంలో రెండో అత్యంత అనూకూలమైన, ఇష్టమైన ఆర్థిక సాధనం జీవిత బీమానే. 2020 నాటికి భారత్‌ ప్రపంచంలోని ప్రధాన ఇన్సూరెన్స్‌ మార్కెట్‌లలో ఒకటిగా మారబోతోంది.

బాధ్యతలను భర్తీ చేస్తుంది!
జీవిత బీమా అనేది మరణించిన తర్వాత మన కుటుంబానికి ఆర్థికంగా బాసటగా నిలుస్తుంది. సంపాదించడం ప్రారంభించిన ప్రతి వ్యక్తి తొలినాళ్లలోనే తప్పకుండా జీవిత బీమా తీసుకోవాలి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు మన మదిని తొలిచేస్తాయి. కోల్పోయిన ఆదాయ భర్తీకి పాలసీ తీసుకుంటున్నావా? లేదా పిల్లల చదువుకా? లేదా తల్లిదండ్రుల కోసమా? ఇలా ఎన్నో అవసరాలు తెరమీదకు వస్తాయి. అందుకే బీమా పాలసీ తీసుకునే ముందు కవరేజ్‌ ఎంతుందో చూసుకోవాలి. ఇది మన అవసరాలకు సరిపడేలా ఉండాలి.

యువతకు బీమా అంటే బేజారా?
చాలా మంది యువత జీవిత బీమాను తీసుకోవడానికి ఇష్టపడరు. దీనికి రెండు కారణాలుంటాయి. ఒకటి వారు దీర్ఘకాలం జీవిస్తామని భావించడం. రెండవది తెలిసి తెలిసి చావుకు ప్రణాళికలు వేసుకోవడం ఎందుకని ఆలోచించడం. ఈ ఆలోచనా ధోరణ మంచిది కాదు. మనం మరణించిన తర్వాత మనల్ని నమ్ముకున్న వారిని ఎవరు చూసుకుంటారో తెలీదు. అందుకే మనం చనిపోయినా కూడా మనం తీసుకున్న బీమా వారిని కష్టాల పాలు కాకుండా చూసుకుంటుందనే విషయాన్ని గుర్తెరగాలి.

ముందుగా బీమా తెలివైన నిర్ణయం
ముందు నుంచే జీవిత బీమా తీసుకోవడాన్ని తెలివైన నిర్ణయంగా భావించాలి. మీరు యుక్త వయసులో ఉన్నప్పుడు పాలసీ తీసుకుంటే దాని ప్రీమియం తక్కువగా ఉంటుంది. అదే ఎక్కువ వయసు ఉన్నప్పుడు తీసుకుంటే ప్రీమియం ఎక్కువవుతుంది. కొంతమంది బీమా పాలసీలు చాలా ఖరీదైనవని, గందరగోళంగా ఉంటాయని, అర్థం చేసుకోవడం కష్టమని అనుకుంటుంటారు. మీరు ఎంత మొత్తంలో ప్రీమియం చెల్లించగలరనే ప్రాతిపదికనే మీ పాలసీ ఎంపిక జరగాలి. తర్వాత కంపెనీ సెటిల్‌మెంట్‌ రేటు ఏవిధంగా ఉందో చూడండి. ఈ వివరాలు ఆయా కంపెనీల వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉంటాయి. అలాగే మనపై ఆధారపడ్డ వారి భవిష్యత్‌ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకొని పాలసీని ఎంపిక చేసుకోవాలి. జీవిత బీమా పాలసీ ఎప్పుడు తీసుకోవాలి అని మీరు మీ అంతరాత్మను ప్రశ్నించుకుంటే.. దానికి సమాధానం ఇప్పుడే అని తెలుసుకోండి.

మరిన్ని వార్తలు