జాక్‌పాట్!

31 Mar, 2015 18:26 IST|Sakshi
జాక్‌పాట్!

ఐపీఎల్ వేలం
వజ్రం ఎప్పటికీ విలువైనదే... వన్నె తగ్గినా దాని ధర పెరుగుతుంది తప్ప తగ్గదు... క్రికెటర్ యువరాజ్ సింగ్ విషయంలో ఇది అక్షరాలా మరోసారి రుజువైంది. ప్రపంచకప్ ఆడటానికి పనికిరావు పొమ్మన్నారు... నీకు రూ.14 కోట్లెందుకు అని వదిలేశారు. కానీ క్రికెట్ ప్రపంచంలో తన విలువ అంతకంతకు పెరిగిందే తప్ప ఏ మాత్రం తగ్గలేదు. ఈసారి ఏకంగా ఏడాదికి 16 కోట్ల రూపాయలు... వచ్చే సీజన్ ఐపీఎల్ కోసం వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ యువరాజ్‌కు ఇచ్చిన ధర ఇది.

ఇది అలాంటిలాంటిది కాదు... జాక్ పాట్... క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడికీ ఒక్క సీజన్‌కు దక్కని మొత్తాన్ని ఈ డాషింగ్ ఆల్‌రౌండర్ సొంతం చేసుకోబోతున్నాడు..

 
బెంగళూరు: జాతీయ జట్టుకు దూరమైనా... ఫామ్‌లో లేకపోయినా.. డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీలు డబ్బుల వర్షం కురిపించాయి. సోమవారం జరిగిన ఆటగాళ్ల వేలంలో ఢిల్లీ డేర్‌డేవిల్స్ కనీవినీ ఎరుగని రీతిలో రూ. 16 కోట్లకు యువీని కొనుగోలు చేసింది. గతంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఈ పంజాబ్ ప్లేయర్‌ను రూ. 14 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్‌లో రెండో అత్యధిక ధర పలికిన దినేశ్ కార్తీక్‌ను బెంగళూరు ఫ్రాంచైజీ రూ. 10.5 కోట్లకు దక్కించుకుంది.

గతంతో పోలిస్తే ఈసారి అతనికి రూ. 1.5 కోట్ల తక్కువ ధర పలికింది. శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌కు కూడా ఊహించని రీతిలో ధర పలికింది. గత సీజన్‌లో ఎవరూ తీసుకోని మాథ్యూస్‌ను... ఈసారి ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ. 7.5 కోట్లకు కొనుగోలు చేసింది. రోజంతా జరిగిన ఈ వేలంలో మొత్తం 343 మంది ఆటగాళ్లు పాల్గొనగా, 67 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. అందులో 23 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అయితే చాలా మంది స్టార్ ఆటగాళ్లకు ఈ వేలంలో నిరాశే ఎదురైంది.
 
కరియప్ప బన్‌గయా కరోడ్‌పతి
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీలో వీడియో విశ్లేషకుడిగా పని చేస్తున్న కేసీ కరియప్ప ఈ వేలంలో కోటీశ్వరుడు అయిపోయాడు. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌కు చెందిన ఈ స్పిన్నర్‌ను కోల్‌కతా రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేసింది. కేవలం రూ. 10 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతని కోసం ఫ్రాంచైజీలు బాగానే పోటీపడ్డాయి. హుబ్లీకి చెందిన 20 ఏళ్ల కరియప్ప కోసం ఢిల్లీ కూడా బాగానే పోరాడింది. బీజాపూర్ బుల్స్‌కు చెందిన అతను ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా ఆడలేదు. గత ఏడాది చాంపియన్స్ లీగ్‌కు ముందు నెట్స్‌లో కరియప్ప కోల్‌కతా ఆటగాళ్లకు బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. తన నైపుణ్యాన్ని కలిస్ గుర్తించి ఈ సీజన్‌కు తీసుకోవాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. దీంతో కరియప్ప పంట పండింది.
 
యువరాజ్‌కు రూ. 16 కోట్లు
రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన యువరాజ్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, బెంగళూరు యువీ కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే బిడ్డింగ్ రూ. 7 కోట్లకు చేరుకున్న తర్వాత రాజస్థాన్, పంజాబ్‌లు వెనక్కి తగ్గాయి. ఇక ఢిల్లీ, బెంగళూరు విపరీతంగా ధరను పెంచుకుంటూ పోయాయి.   చివరకు ఢిల్లీ... యువీని రికార్డు స్థాయి రేట్‌తో సొంతం చేసుకుంది.
 
2014: రూ.2.6 కోట్లు  2015: రూ. 4 కోట్లు
జహీర్‌ఖాన్, ఇర్ఫాన్ పఠాన్‌ను తొలి రౌండ్‌లో ఎవరూ కొనలేదు. దీంతో ఈ ఇద్దర్ని రెండో రౌండ్‌లో మళ్లీ వేలానికి పెట్టారు. జహీర్‌కు ఢిల్లీ రూ. 4 కోట్లు వెచ్చించగా, ఇర్ఫాన్‌ను చెన్నై రూ. 1.5 కోట్లకు తీసుకుంది. గత సీజన్‌లో ఇర్ఫాన్ రూ. 2.6 కోట్లకు అమ్ముడుపోయాడు.
 
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్‌కు ఈ వేలం నిరాశపర్చింది. గత వేలంలో ఢిల్లీ రూ. 9 కోట్లకు కొనుగోలు చేయగా, ఈసారి హైదరాబాద్ కనీస ధర రూ. 2 కోట్లకే ఎగరేసుకుపోయింది.
గత సీజన్‌లో రూ.4.75 కోట్లకు అమ్ముడుపోయిన లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను ఈసారి ఢిల్లీ రూ. 3.5 కోట్లకే దక్కించుకుంది.
రూ.50 లక్షల కనీస ధర ఉన్న మురళీ విజయ్‌ని పంజాబ్ రూ. 3 కోట్లకు తీసుకుంది.
ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్‌కు ముంబై ఇండియన్స్ రూ. 3.2 కోట్లు వెచ్చించింది.
ఆల్‌రౌండర్ డారెన్ స్యామీ (రూ.2.8 కోట్లు), దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ వీస్ (రూ. 2.8 కోట్లు)లను బెంగళూరు తీసుకుంది.
ఫిల్ హ్యూజ్ మరణానికి కారణమైన బంతి వేసిన ఆసీస్ పేసర్ సీన్ అబాట్‌ను బెంగళూరు కోటి రూపాయలకు తీసుకుంది.
ఆసీస్ వెటరన్ బ్యాట్స్‌మన్ మైక్ హస్సీని కనీస ధర రూ. 1.5 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది. గత సీజన్‌లో అతని ధర రూ. 5 కోట్లు.
గత వేలంలో హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కోసం రూ. 3.25 కోట్లు వెచ్చించిన ముంబై ఇండియన్స్ ఈసారి తెలివిగా వ్యవహరించింది. కేవలం రూ. 50 లక్షలకే అతన్ని సొంతం చేసుకుంది.
భారత సంతతికి చెందిన ఆసీస్ పేసర్ గురీం దర్ సంధూని రూ.1.7 కోట్లకు, జైదేవ్ ఉనాద్కట్‌ని రూ.1.1 కోట్లకు ఢిల్లీ చేజిక్కించుకుంది.
 
మునాఫ్ పటేల్, చతేశ్వర్ పుజారా, పంకజ్ సింగ్‌లను ఎవరూ కొనలేదు.
సంగక్కరను మూడుసార్లు వేలానికి తెచ్చినా ఎవరూ ఆసక్తి చూపలేదు. జయవర్ధనే, దిల్షాన్ (శ్రీలంక), హషీమ్ ఆమ్లా, అలెక్స్ హేల్స్ (దక్షిణాఫ్రికా), రాస్ టేలర్, రోంచి (న్యూజిలాండ్), బ్రాడ్ హాడ్జ్, కామెరూన్ వైట్ (ఆస్ట్రేలియా), శామ్యూల్స్ (విండీస్) లను కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు.
 
ప్రముఖ వ్యాపారవేత్తలు నీతా అంబానీ, విజయ్ మాల్యా, బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింతా, మాజీ క్రికెటర్లు ద్రవిడ్, అనిల్ కుంబ్లే, రికీ పాంటింగ్, ఫ్లెమింగ్, లక్ష్మణ్‌లు తమ ఫ్రాంచైజీల తరఫున హాజరయ్యారు. అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ. 87.6 కోట్లు ఖర్చు చేశాయి.
 
ఆచితూచి వ్యవహరించిన ‘సన్’
స్టార్లపై కాకుండా ఈసారి మామూలు స్థాయి ఆటగాళ్లపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎక్కువగా దృష్టిపెట్టింది. ఇంగ్లండ్ మాజీ స్టార్ కెవిన్ పీటర్సన్ (రూ. 2 కోట్లు)ను కనీస ధరకు తీసుకుంది. బెంగళూరు, ముంబైల నుంచి గట్టిపోటీ ఎదుర్కొని కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను రూ. 3.8 కోట్లకు దక్కించుకున్న సన్‌రైజర్స్.. ఇయాన్ మోర్గాన్ కోసం రూ. 1.5 కోట్లు వెచ్చించింది. కేన్ విలియమ్సన్‌ను కేవలం రూ. 60 లక్షలకే చేజిక్కించుకుంది. బౌలింగ్ బలోపేతం కోసం పేసర్ ప్రవీణ్ కుమార్‌కు రూ. 2.20 కోట్లు, రవి బొపారాకు కోటి రూపాయలు ఖర్చు చేసింది. గత వేలంలో కోటిన్నర పలికిన లక్ష్మీరతన్ శుక్లాను చాలా తక్కువగా రూ. 30 లక్షలకు తీసుకుంది. హైదరాబాద్ రంజీ ప్లేయర్ హనుమ విహారి, ప్రశాంత్, సిద్ధార్థ్ కౌల్‌లకు తలా రూ 10లక్షలు వెచ్చించింది.
 
కరియప్ప బన్‌గయా కరోడ్‌పతి
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీలో వీడియో విశ్లేషకుడిగా పని చేస్తున్న కేసీ కరియప్ప ఈ వేలంలో కోటీశ్వరుడు అయిపోయాడు. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌కు చెందిన ఈ స్పిన్నర్‌ను కోల్‌కతా రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేసింది. కేవలం రూ. 10 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతని కోసం ఫ్రాంచైజీలు బాగానే పోటీపడ్డాయి. హుబ్లీకి చెందిన 20 ఏళ్ల కరియప్ప కోసం ఢిల్లీ కూడా బాగానే పోరాడింది. బీజాపూర్ బుల్స్‌కు చెందిన అతను ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా ఆడలేదు. గత ఏడాది చాంపియన్స్ లీగ్‌కు ముందు నెట్స్‌లో కరియప్ప కోల్‌కతా ఆటగాళ్లకు బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. తన నైపుణ్యాన్ని కలిస్ గుర్తించి ఈ సీజన్‌కు తీసుకోవాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. దీంతో కరియప్ప పంట పండింది.

మరిన్ని వార్తలు