మాంసంలో నాటు బాంబులు పెట్టి..

9 Jun, 2020 20:13 IST|Sakshi

చెన్నై: కేరళ గర్భిణి ఏనుగు మృతిపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో తమిళనాడులో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. పేలుడు పదార్థాలు కలిపిన మాంసం తిని నక్క మృత్యువాత పడింది. ఈ ఘటనలో 12 మందిని స్థానిక అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. వివరాలు.. నారికురవర్లుగా వ్యవహరించబడే వివిధ తెగలకు చెందిన వ్యక్తులు జంతువులను వేటాడి జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం నక్క దంతాలు సేకరించేందుకు.. మాంసంలో పేలుడు పదార్థాలు పెట్టి దానికి ఎరవేశారు. మాంసాన్ని చూసి అక్కడికి చేరుకున్న నక్క.. దానిని తినేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది.(13 కోతులు మృ‌తి: విషం పెట్టి చంపారా?)

ఈ ఘటనలో దాని దవడలు, ముఖం చెల్లాచెదురై పోయి.. అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు 12 మంది నారికురవర్లను అరెస్టు చేశారు. ఈ విషయం గురించి అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ..‘‘తేనె సేకరించేందుకు 12 మంది తిరుచి సమీపంలోని ఓ గ్రామానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా నక్క వారి కంటపడింది. దీంతో తమ వద్దనున్న నాటు బాంబులు మాంసంలో పెట్టి.. నక్కకు అందుబాటులో ఉంచారు. నక్క దానిని తినగానే దవడ పేలిపోయింది. నొప్పితో అల్లాడుతూ అది చనిపోయింది’’ అని వెల్లడించారు. అనంతరం నక్క మృతదేహాన్ని ఓ సంచీలో వేసుకుని.. టీ తాగుతుండగా.. నిందితుల ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఓ కానిస్టేబుల్‌ తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. విచారణలో భాగంగా వారు నక్కను వేటాడి చంపినట్లు వారు అంగీకరించినట్లు పేర్కొన్నారు. (కుక్క నోటికి ప్లాస్ట‌ర్ చుట్టి..)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు