‘కత్తి’లాంటి బర్త్‌డే పార్టీ!

8 Feb, 2018 03:36 IST|Sakshi
పిడికత్తితో కేక్‌ కట్‌ చేస్తున్న దృశ్యం.

సాక్షి ప్రతినిధి, చెన్నై: రౌడీ..బర్త్‌డే వేడుకకు అట్టహాసంగా ఏర్పాట్లు చేసుకున్నాడు. వాసన పసిగట్టిన పోలీసులు ఆఖరి నిమిషంలో ఎంటర్‌ కావటంతో కథ రివర్సయింది. చెన్నై సూలైమేడుకు చెందిన బిన్నీ (40)కి పెద్ద రౌడీ అనే పేరుంది. చెన్నైకి చెందిన ఓ మంగళవారం ఇతని పుట్టిన రోజు కావటంతో నగర శివార్లలోని ఓ లారీ షెడ్డులో వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నాడు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు చెందిన 150 మందికి పైగా రౌడీలకు ఆహ్వానాలు పంపాడు.

రాత్రికల్లా అందరూ షెడ్డు వద్దకు చేరుకోగా బాణసంచాతో వారికి స్వాగతం పలికారు. ఆనవాయితీ ప్రకారం బిన్నీ పిడికత్తితో కేక్‌ కూడా కోశాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో అంబత్తూరు డిప్యూటీ కమిషనర్‌ సర్వేష్‌రాజ్‌ నేతృత్వంలో 70 మంది పోలీసులు మెరుపుదాడి చేసి 75మంది రౌడీలను అదుపులోకి తీసుకున్నారు. బిన్నీతోపాటు మరో 50 మంది మాత్రం తప్పించుకున్నారు.

ఆ ప్రాంతంలో ఉన్న మారణాయుధాలతోపాటు 50కి పైగా సెల్‌ఫోన్లు, 50 బైకులు, 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు. నేరాల ప్రణాళిక, సమాచారం చేరవేత, అమలు కోసం రౌడీలంతా సెల్‌ఫోన్లలో ఒక ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపును కూడా నడుపుతున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామని చెన్నై పోలీస్‌ కమిషనర్‌ విశ్వనాథన్‌ తెలిపారు.  

                  రౌడీల నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్న మారణాయుధాలు, మొబైల్‌ ఫోన్లు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు