భారీగా ఐస్‌క్రీమ్స్‌ పట్టివేత

30 Mar, 2018 13:25 IST|Sakshi
ఐస్‌క్రీమ్స్‌ పరిశీలిస్తున్న విజిలెన్స్‌ అధికారులు

నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని గుర్తింపు

విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని తయారీ కేంద్రంపై కేసు నమోదు

ఎచ్చెర్ల క్యాంపస్‌: జాతీయ రహదారిపై చిలకపాలెం సమీపంలో టోల్‌ప్లాజా వద్ద నాణ్యతా ప్రమాణాలు పాటించని ఐస్‌క్రీమ్స్‌ను భారీగా పట్టుకున్నారు. శ్రీకాకుళం రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఐస్‌క్రీమ్‌లు పట్టుపడ్డాయి. ఇందులో నాణ్యతా ప్రమాణాలు పాటించని ఐస్‌క్రీమ్స్‌ను గుర్తించారు. వీటి విలువ రూ. 60 వేలు ఉంటాయని అంచనావేశారు. కప్పులు, చాకోబార్, కోన్సు రకాలు ఉన్నాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల ప్రాంతానికి చెందిన శ్రీవెంబమాంబ ప్రొజెన్‌ ఫుడ్స్‌ నుంచి టెక్కలిలో అమ్మకానికి ఈ ఐస్‌క్రీమ్స్‌ తీసుకువెళుతున్నారు. ఈ ఐస్‌క్రీమ్స్‌పై బ్యాచ్‌ నంబర్, తయారీ తేదీ, వినియోగ పరిమితి వంటి అంశాలు ప్రస్తావించలేదు. కొన్ని కప్పులపై మాత్రం కాలపరిమితి ఆరు నెలలు, 12 నెలల్లోపు వినియోగించవచ్చునని ఉంది. ఈ ఐస్‌క్రీమ్స్‌ నాణ్యతా ప్రమాణాలు, పిల్లలు తినటం వల్ల వారి ఆరోగ్యంపై చూపే ప్రభావం వంటి అంశాలు తెలుసుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన స్టేట్‌ ల్యాబ్‌రేటరీకి నమూనాలు పంపించినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చెప్పారు.

మరోపక్క విజయనగరం అధికారులను రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి టి.హరికృష్ణ, డీఎస్పీ ప్రసాదరావు, సీఐ జి.చంద్ర అప్రమతం చేశారు. ఈ మేరకు విజయనగరం ఫుడ్‌ సేప్టీ అధికారులు ఐస్‌క్రీమ్‌ తయారీ యూనిట్‌ను విస్తృతంగా పరిశీలించారు. మంచినీరు వినియోగించకపోవటం, వనస్పతి నూనె పరిమితికి మించి వినియోగించటం వంటి లోపాలు అక్కడ బయటపడినట్టు అధికారులు చెప్పారు. ఐస్‌క్రీమ్స్‌ తయారీకి వినియోగించే పలు వస్తు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మరో పక్క ఇంటికి వినియోగించే గ్యాస్‌ సిలిండర్లు ఇక్కడ ఆరు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఈ గ్యాస్‌ సిలిండర్లు వినియోగానికి సంబంధించి పౌరసరఫరాల శాఖ అధికారులు 6ఏ కేసు నమోదు చేసి, సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కల్తీ ఆహార చట్టాలు కింది కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని విజిలెన్స్‌ అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు