హోం లోన్లు: ఎస్‌బీఐ శుభవార్త

30 Mar, 2018 13:32 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  గృహ రుణ గ్రహీతకు శుభవార్త అందించింది. మార్చి 31, 2018లోపు ఇంటి రుణాలు తీసుకునే వారికి ప్రాసెసింగ్‌ ఫీజును పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటించింది.  దీంతోపాటు  వేరే బ్యాంకుల్లో ఇంటి రుణం తీసుకున్నవారు కూడా మార్చి 31లోపు ఎస్‌బీఐకు మారినట్లయితే వారికి కూడా 100శాతం ప్రాసెసింగ్‌ ఫీజును రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. మార్చి31తో ఈ ఆర్థికసంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో వినియోగదారులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. 

అలాగే గతంలో ప్రకటించినట్లుగానే ఇన్ని రోజులుగా వినియోగిస్తున్న ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకుకు సంబంధించిన చెక్‌బుక్‌లు 31-03-2018 వరకే పనిచేస్తాయని, ఆ తర్వాత కొత్త  చెక్‌బుక్స్‌ను మాత్రమే అనుమతిస్తామని ఎస్‌బీఐ ట్వీట్‌ చేసింది. ఈ విషయాన్ని గుర్తించి వినియోగదారులు కొత్త చెక్‌బుక్కుల కోసం తమ దగ్గర్లోని ఎస్‌బీఐ బ్యాంకులను సంప్రదించాలని పేర్కొంది.

కొద్ది రోజుల క్రితమే ఎస్‌బీఐ సేవింగ్స్‌ అకౌంట్లలో సగటు నెలవారీ మొత్తాలను నిల్వ చేయకపోతే విధించే చార్జీలను కూడా తగ్గించింది. పట్టాణాల్లో నెలకు రూ.50 ఉన్న చార్జీలను రూ.15కు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.40 ఉన్నచార్జీలను రూ.10కు (జీఎస్‌టీని కలుపుకుని)తగ్గించారు. తగ్గించిన ఈ చార్జీలు 11-04-2018నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు