బిగ్‌బాస్‌ నిర్వాహకులకు నోటీసులు 

24 Jul, 2019 10:37 IST|Sakshi

బంజారాహిల్స్‌ : స్టార్‌ మా ఛానల్‌లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌–3 కార్యక్రమంపై ఫిర్యాదుల నేపథ్యంలో బంజారాహిల్స్‌ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–2లోని స్టార్‌ మా కార్యాలయ అడ్మిన్‌హెడ్‌ శ్రీధర్‌కు బంజారాహిల్స్‌ పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈనెల 13న సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి బిగ్‌బాస్‌ కార్యక్రమ ఇన్‌ఛార్జ్‌ శ్యామ్‌తో పాటు రవికాంత్, రఘు, శశికాంత్‌లపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో  ఫిర్యాదు చేసింది. బిగ్‌బాస్‌ అగ్రిమెంట్‌ వ్యవహారంతో పాటు క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉన్నట్లు  ఆరోపించారు. బిగ్‌బాస్‌ను ఎలా సంతృప్తి పరుస్తారంటూ ప్రశ్నించడం తదితర అంశాలను ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌ పోలీసులు శ్యామ్‌తో పాటు రవికాంత్, రఘు, శశికాంత్‌లపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు స్టార్‌ మా కార్యాలయం అడ్మిన్‌ శ్రీధర్‌కు నోటీసులు అందజేశారు. నోటీసుల్లో భాగంగా ఆరు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సూచించారు. అగ్రిమెంట్‌ వ్యవహారం, ఎంపిక, ఎంపిక నిబంధనలు, శ్యామ్‌తో పాటు మిగిలిన ముగ్గురి పాత్ర, తదితర అంశాలపై మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని సూచించారు. దీనిపై  ఉన్నత స్థాయిలో చర్చించి సమాధానం ఇస్తామని శ్రీధర్‌ పోలీసులకు తెలిపారు. అయితే శ్యామ్, రవికాంత్, రఘు, శశికాంత్‌లతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదంటూ స్టార్‌ మా కార్యాలయం నిర్వాహకులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. దీంతో కేసు కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు నిజంగానే ఆ ఛానల్‌కు సంబంధం లేరా? అన్నది నోటీసులో ఇచ్చే సమాధానాన్ని బట్టి స్పష్టం కానుంది. 
 

మరిన్ని వార్తలు