భారత్‌ బంద్‌ హింసాత్మకం.. రాజకీయ కుట్ర!

2 Apr, 2018 19:27 IST|Sakshi
భారత్‌ బంద్‌ సందర్భంగా చెలరేగిన హింస.. పలు ప్రాంతాల్లో కనిపించిన దృశ్యాలు

ఇప్పటివరకు 10 మంది మృతి.. పలువురికి గాయాలు

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అల్లర్లు.. సైన్యం మోహరింపు

దక్షిణ భారతంలో కానరాని ప్రభావం

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ దళిత సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్‌ కార్యక్రమంలో తీవ్ర హింస చెలరేగింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 10 మంది మరణించగా, వందల మందికి గాయాలయ్యాయి. బంద్‌ పిలుపు మేరకు మెజారిటీ రాష్ట్రాల్లోని దళిత సంఘాలు సోమవారం ఉదయం నుంచే నిరసనలు చేపట్టాయి. ఎక్కడిక్కడ రైళ్లు, బస్సులను అడ్డుకుని, రహదారులను దిగ్భందించారు. వేల సంఖ్యలో గుమ్మికూడిన దళితులు ర్యాలీలు చేపట్టారు. పలు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో అప్రకటిత కర్వ్యూ వాతావరణం నెలకొంది. తొలుత రోడ్లపై టైర్లను తగులబెట్టిన నిరసనకారులు.. అదే క్రమంలో కొన్ని వాహనాలకు నిప్పుపెట్టారు. నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నంలో చాలా చోట్ల పోలీసులు లాఠీచార్జ్‌ చేయగా, మరికొన్ని చోట్ల కాల్పులు జరిగినట్లు తెలిసింది.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హింస: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం కింద నిందితులను తక్షణమే అరెస్టు చేయరాదంటూ గత నెల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. చట్టంలో మార్పులను వ్యతిరేకిస్తూ అన్ని రాష్ట్రాల్లోని దళిత సంఘాలు సోమవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌ ఉధృతంగా సాగుతుండగానే.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళతామని న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. కాగా, బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో హింసాయుత ఘటనలు అధికంగా చోటుచేసుకోవడం గమనార్హం. అటు పంజాబ్‌, హరియాణా, బిహార్‌, జార్ఖండ్‌, గుజరాత్‌, మహారాష్ట్రలో భారత్‌ బంద్‌ తీవ్ర ఉద్రికతలకు దారితీసింది. పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి వచ్చి బలవంతంగా షాపులు మూయించారు. ఆస్తుల విధ్వంసానికి దిగారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే హింస చెలరేగడం రాజకీయ కుట్రేలో భాగంగానే జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. (చదవండి: ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని రద్దు చేయాల్సిందేనా?)

మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలు బంద్‌: అల్లర్లు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను నిషేధించారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో ఈ నిషేధం కొనసాగుతున్నది. రాష్ట్రాలు కోరితే అవసరమైన మేరకు కేంద్ర బలగాలు, సైన్యాన్ని పంపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మీడియాతో అన్నారు.

మాయ, మమత సంతాపం: దళిత సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్‌ పలు ప్రాంతాల్లో హింసాత్మకంగా మారడం, 10 మంది చనిపోవడం బాధాకరమని బీఎస్సీ చీఫ్‌ మాయావతి, టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీలు అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్‌ నగర్‌, మీరట్‌ సహా పలు ప్రాంతాల్లో ఆందోళనలకు సంబంధించి పలువురు బీఎస్పీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని మాయావతి ఖండించారు.

దక్షిణాదిలో అంతంతమాత్రమే: దళిత సంఘాల భారత్‌ బంద్‌ పిలుపు మధ్య, ఉత్తర భారతాన్ని ప్రభావితం చేసినంతగా దక్షిణ భారతాన్ని చేయలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలు, ఎన్నికల రాష్ట్రం కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో బంద్‌ ప్రభావం అంతగా కనిపించలేదు.

మరిన్ని వార్తలు