పాపం పసివాళ్లు

8 May, 2019 09:02 IST|Sakshi
లోకేష్‌ (ఫైల్‌) లోకేష్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

ఆడుకుంటున్న తాడే ఉరితాడై..

బాలాపూర్‌లో బాలుడి మృతి  

మీరాలంమండిలో భవనం పైనుంచి పడి బాలుడి మృతి

పహాడీషరీఫ్‌: ఎనిమిదేళ్ల క్రితమే అమ్మా నాన్నలను కోల్పోయి బాబాయి వద్ద పెరుగుతున్న ఓ బాలుడి జీవితంతో విధి మరోసారి ఆడుకుంది. ఇంట్లో తాడుతో ఆడుకుంటుండగా తాడు మెడకు చుట్టుకొని ఉరి పడటంతో బాలుడు మృతి చెందిన సంఘటన బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై మధు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లాపూర్‌ గ్రామానికి చెందిన కె.లోకేష్‌(11)కు తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్నాన్న ప్రభాకర్, చిన్నమ్మ హరిత వద్ద ఉంటూ స్థానిక లార్డ్స్‌ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం అతను తన చిన్నాన్న కుమారుడితో కలిసి  తాడుతో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు తాడు మెడకు బిగుసుకుంది. కొద్ది సేపటి తర్వాత ఇంట్లోకి వచ్చిన అతడి  చిన్నమ్మ హరిత దీనిని గుర్తించి స్థానికుల సహాయంతో లోకేష్‌ను బాలాపూర్‌లోని ఓం సాయి ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యుల సూచనమేరకు డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లింది. వారు నిలోఫర్‌కు రెఫర్‌ చేశారు. దీంతో అతడిని నిలోఫర్‌కు తీసుకెళ్లగా బాలుడిని పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

ఎనిమిదేళ్ల క్రితం తల్లిదండ్రులు మృతి  
లోకేష్‌(11) తల్లిదండ్రులు శ్రీనివాస్, లావణ్య ఎనిమిదేళ్ల క్రితమే మృతి చెందారు. 2011లో కుటుంబ కలహాల కారణంగా అతడి తల్లి లావణ్య ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. మంటలను ఆర్పే క్రమంలో భర్తకు కూడా అంటుకోవడంతో ఇద్దరు మృతి చెందారు. దీంతో అప్పటి నుంచి వారి బాబాయి ప్రభాకర్‌ చిన్నారులను పెంచుకుంటున్నాడు. కాగా ఈ నెల 10న లోకేష్‌ మరో బాబాయి పెళ్లి జరుగనుంది. ఈ తరుణంలో లోకేష్‌ మృతితో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.  

భవనంపై నుంచి పడి బాలుడి దుర్మరణం
యాకుత్‌పురా:  ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి మూడేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మీర్‌చౌక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్సై లక్ష్మీనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  కలకత్తా ప్రాంతానికి చెందిన కరీముల్లా ఘాజీ, హీనా ఘాజీలు దంపతులు ఐదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు.   మీరాలంమండిలో ఉంటూ బుర్ఖాల దుకాణంలో పని చేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి అతడి కుమారుడు అర్షద్‌(3) చిన్నారులతో కలిసి భవనంపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డా డు. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం పురానీహవేలిలోని దుర్రు షెహవర్‌ ఆసుపత్రికి త రలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. మీర్‌చౌక్‌ పోలీసు లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు