వధువు అనైతిక సంబంధం.. వారిద్దరు అరెస్ట్‌

22 Feb, 2018 18:18 IST|Sakshi

వరుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వధువు సోదరుడు

పోలీసుల అదుపులో వధువు, ఆమె సోదరుడు

సాక్షి, వరంగల్‌, రఘునాథపల్లి: కాబోయే వరుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటనలో వధువు అరుణ, ఆమె సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరుసకు అన్నయ్య అయిన బాలస్వామితో కొనసాగించిన ప్రేమ వ్యవహారమే వరుడి హత్యాయత్నానికి దారి తీసిందని స్టేషన్ ఘణపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు గురువారం మీడియాకు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే వధువు అరుణ, వరుడు యాకయ్యకు ఇంటి బయటకు రప్పించగా.. అప్రమత్తంగా ఉన్న బాలస్వామి వరుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం.

అసలేం జరిగిందంటే.. 
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన గొంగోళ్ల సామ్యేల్- యాదమ్మల కుమారుడు యాకయ్యకు మాదరం గ్రామానికి చెందిన అరుణతో ఈనెల 21న పెళ్లి చేయాలని ఇరువర్గాల కుటుంబసభ్యులు నిర్ణయించారు. వధువుకు మాత్రం ఈ వివాహం ఇష్టం లేదు. కారణం ఆమె గత మూడేళ్లుగా బాలస్వామితో ప్రేమలో ఉంది. కానీ, బాలస్వామి మరెవరో కాదు.. వధువుకు స్వయాన పెద్దమ్మ కొడుకు. పెళ్లిని ఆపేందుకు బాలస్వామితో కలిసి వధువు పథకం పన్నింది. మరోవైపు ఆదివారం 18 తేది నాడు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన వరుడు కుటుంబం రాత్రి బంధువులతో హడావిడిలో ఉండగా వధువు అరుణ నుండి యాకయ్యకు ఫోన్ కాల్ వచ్చింది. 

ఫోన్ సిగ్నల్ సరిగా లేదని బయటకు మాట్లాడమని అరుణ చెప్పడంతో వరుడు యాకయ్య బయటకు వచ్చాడు. అప్పటికే మాటువేసిన బాలస్వామి ఒక్కసారిగా యాకయ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో ఉన్న యాకయ్యను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం అరుణ, బాలస్వామిలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు