తమ్ముడి ఇంట్లో చోరీ.. అన్న అరెస్ట్‌

6 Apr, 2018 13:25 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న భీమవరం వన్‌టౌన్‌ సీఐ గోవిందరాజు, చిత్రంలో నిందితుడు, స్వాధీనం చేసుకున్న సొత్తు

భీమవరం టౌన్‌: తమ్ముడి ఇంట్లోనే చోరీ చేసిన అన్న చివరికి పోలీసులకు దొరికిపోయాడు. నిందితుని వద్ద నుంచి 8 కాసుల బంగారు ఆభరణాలు, 1800 గ్రాముల వెండి వస్తువులు రూ.92,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను భీమవరం వన్‌టౌన్‌ సీఐ కె.గోవిందరాజు వెల్లడించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న గ్రంధి నాగరాజు ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. వ్యసనాలకు బానిసై అప్పులపాలయ్యాడు. ఈ నేపథ్యంలో ఆదివారం బజారు ప్రాంతంలో నివసిస్తున్న  తమ్ము డు గ్రంధి శ్రీనివాస్, తల్లి అనసూయమ్మను తరుచూ సొమ్ముల కోసం వేధి స్తుండటంతో వారు సహాయం చేస్తుండేవారు.

అయితే నాగరాజు అప్పులు తీర్చడం మాని వ్యసనాలకు ఖర్చు చేయడంతో వారు తిరిగి సాయం చేయడానికి నిరాకరించారు. ఈనేపథ్యంలో గత నెల 30న శ్రీనివాస్‌ ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో భద్రాచలం సమీపంలోని దమ్మపేట బంధువుల ఇంట గృహ ప్రవేశానికి వెళ్లాడు. అదేరోజు రాత్రి నాగరాజు తన తమ్ముడు శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లి రెండో తాళం చెవితో తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించాడు. పరుపు కింద ఉన్న తాళాలతో బీరువా తెరిచి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.97,500 నగదు అపహరించాడు. చోరీ సొత్తును ర్యాలి, వేల్పూరు గ్రామాల్లో తెలిసిన వారి ద్వారా అమ్మడానికి ప్రయత్నించగా కుదరలేదు. దీంతో గురువారం నాగరాజు వాటిని తీసుకుని ఇం టికి వెళుతుండగా తాడేరు బ్రిడ్జి వద్ద సీఐ కె.గోవిందరాజు సిబ్బందితో కలిసి పట్టుకుని అరెస్ట్‌ చేశారు. దొంగిలించిన నగదులో రూ.5 వేలు అప్పటికే ఖర్చుపెట్టేశాడు. చేసిన నేరాన్ని నిందితుడు అంగీకరించాడని,  కోర్టులో హాజరుపరుస్తామని సీఐ చెప్పారు. సమావేశంలో ఎస్సై పి.అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు