అన్న చెప్పుతో కొట్టాడని..

26 Feb, 2020 10:11 IST|Sakshi
మృతి చెందిన వీరమ్మాల్, భవాని (ఫైల్‌)

కుటుంబంతో ఆత్మహత్య చేసుకున్న తమ్ముడు

రెండు మృతదేహాలు లభ్యం

మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు

పళవేర్కాడులో ఘటన

తమిళనాడు, తిరువళ్లూరు: ఇంటి స్థలం వివాదంలో అన్న చెప్పుతో కొట్టి అవమానించారన్న మనస్తాపంతో తమ్ముడు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరువళ్లూరులో విషాదాన్ని నింపింది. ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా మరో ఇద్దరి ఆచూకీ కానరాలేదు. వివరాలు.. పళవేర్కాడు సమీపంలోని కొక్కుపాళ్యం గ్రామానికి చెందిన రవి(51)కి శివ, రామదాసు సహా ఐదుగురు సోదరులు. శివ–రవి మధ్య ఐదేళ్ల నుంచి ఇంటి స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. ఇటీవల రెండు కుటుంబాలు ఘర్షణపడి పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లాయి. మూడు రోజుల క్రితం రవి–శివ మధ్య మరోసారి వివాదం నెలకొంది. ఆగ్రహించిన శివ తమ్ముడు రవిపై దాడి చేయడంతో పాటు అందరి ముందు చెప్పుతో కొట్టి అవమానించాడు.

దీంతో రవి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. కుటుంబంతో సహా ఆత్మహత్యకు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం తన బాధను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. ఈ వీడియో తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం పళవేర్కాడు చెరువులో 18 ఏళ్ల యువతి మృతదేహాం, మంగళవారం ఉదయం మరో మహిళ మృతదేహాన్ని మత్స్యకారులు గుర్తించారు. తిరుపాళ్యవనం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక వైద్యశాలకు తరలించారు. విచారణలో మృతి చెందిన మహిళ రవి భార్య వీరమ్మాల్‌(42), కుమార్తె భవానీ(18)గా గుర్తించారు. రవి, అతని కుమారుడు బాలమురుగన్‌(24) కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రవి మరో అన్న రామదాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా