కన్నీళ్లకే కన్నీళ్లొస్తే! 

12 May, 2019 07:14 IST|Sakshi
వెల్దుర్తి వద్ద తుపాను వాహనాన్ని వోల్వో బస్సు ఢీకొన్న దృశ్యం

గుట్టగా మతదేహాలు..తునాతునకలైన తుపాన్‌ వాహనం..ఆనవాళ్లు కోల్పోయిన బైక్‌...మత్యువులా దూసుకొచ్చిన వోల్వో బస్సు..వెల్దుర్తి సమీపంలో భీతావహ దశ్యం. మిన్నంటిన రోదనలు.. విషణ్ణ వదనాలతో ప్రజలు..మాటలకందని విషాదమిది..గుండెలు పగిలే శోకమిది.. వారంతా రైతులు..వ్యవసాయం చేసుకొని బతికేవారు.. సొంతూరు తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లాలోని రామాపురం. ఊర్లో యువకునికి పెళ్లి ఖాయం చేసుకునేందుకు అనంతపురం జిల్లా గుంతకల్లుకు వెళ్లారు.

‘మంచి మాట’ చేసుకుని తుపాన్‌ వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో ఎన్నో ఊసులు చెప్పుకున్నారు. ఊర్లో సంగతులు మాట్లాడుకున్నారు. పెళ్లి ఎలా చేయాలో కూడా చర్చించుకున్నారు. అయితే.. వెల్దుర్తి వద్దకు రాగానే ఉన్నట్టుండి ఓ కుదుపు. వోల్వో బస్సు వేగంగా వచ్చి ముందు బైక్‌ను..ఆ వెంటనే తుపాన్‌ వాహనాన్ని ఢీకొట్టింది. మాటలన్నీ ముక్కలయ్యాయి. ఆర్తనాదాలు మిన్నంటాయి. క్షణాల్లోనే 13 మంది విగతజీవులుగా మారారు. మరో ముగ్గురు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మతి చెందారు. ఈ వార్త విని రామాపురం కన్నీటిసంద్రంగా మారింది.  

తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ లక్ష్మన్న, జయలక్ష్మీల కుమారుడు శ్రీనాథ్‌కు అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన మేనమామ కుమార్తెతో పెళ్లి ఖాయం చేసుకోవడానికి శనివారం ఉదయం 8:30గంటలకు 30 మంది రెండు తుపాన్‌ వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గుంతకల్‌ చేరుకొని పెళ్లి ఖాయం చేసుకొని తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు సొంతూరుకు బయలు దేరారు. ఆడవాళ్లు ఉండే వాహనం ముందు వెళ్తుండగా మగవాళ్ల వాహనం వారిని ఆనుసరించింది. వెల్దుర్తి సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద హైదరాబాద్‌ నుంచి మంగళూరుకు వెళ్తున్న ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ వోల్వో బస్సు ముందు వస్తున్న మోటార్‌ బైక్‌ను తప్పించి బోయి.. మరో బైక్‌ను ఢీకొని అదుపు తప్పి తుపాన్‌ వాహనాన్నీ ఢీకొట్టింది.

100 మీటర్ల వరకు వాహనాన్ని ఈడ్చుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న 13 మంది అక్కడికక్కడే మతి చెందారు. మతదేహాలన్నీ గుట్టగా పడిపోయాయి. ఐదుగురు తీవ్రంగా గాయపడడంతో పోలీసులు 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు మతి చెందగా.. మిగిలిన ఇద్దరు చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు. ప్రమాద సమయంలో వోల్వో బస్సు గంటకు సుమారు 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు తేలింది.  

వెల్దుర్తి: అరగంట ఆగితే రంజాన్‌ సందర్భంగా చేపట్టిన రోజా విరమించేవారు. అంతలోనే బస్సు రూపంలో ఒకరిని పొట్టన పెట్టుకోగా.. మరొకరిని తీవ్ర గాయాలపాలు చేసింది. వివరాలు.. వెల్దుర్తి పట్టణానికి చెందిన కటికె మాసూం(32) తన బైక్‌లో పెట్రోల్‌ అయిపోవడంతో స్నేహితుడి పల్సర్‌ బైక్‌ను తీసుకొని చిన్నాన్న కుమారుడు కటికె ఖాజాను వెంట తీసుకెళ్లాడు. హైవేలోకి వెళ్లి వ్యాపారానికి అవసరమయ్యే పొట్టేలును చూసి తిరుగు ప్రయాణమయ్యారు. జాతీయ రహదారి నుంచి వెల్దుర్తిలోకి చెక్‌పోస్ట్‌ వద్ద యూటర్న్‌లో వెళ్లాల్సి ఉండగా, డోన్‌ వైపు ఓల్వో బస్సు రావడాన్ని గమనించి ఆగారు.

అదే సందర్భంలో మరో బైక్‌ యూటర్న్‌ ద్వారా వెళ్లడం, కన్‌ఫ్యూజ్‌ అయిన అతివేగంతో ఉన్న బస్సును డ్రైవర్‌ కుడివైపునకు మళ్లించడంతో బైక్‌ను అతివేగంగా ఢీకొన్న బస్సు కర్నూలు వైపు వెళ్తున్న జీపును ఢీకొంది. ప్రమాదంలో బైక్‌పై నుంచి ఎగిరిపడిన మాసూం కొన ఊపిరితో ఉండగా, ఖాజా తీవ్రంగా గాయపడ్డాడు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాసూం మతిచెందాడు. కటికె మాసూం పట్టణంలో గౌండ పనిచేస్తూ, పెళ్లిళ్లలో మటన్‌ కోస్తూ తలలో నాలుకలా ఉండేవాడు. మాసూంకు తల్లి మాసూంబీ, తండ్రి నూర్‌అహమ్మద్, భార్య రిజ్వానా, మూడేళ్ల కుమారుడు అయాన్, 8నెలల కూతురు రుబానా ఉన్నారు. విషమ పరిస్థితుల్లో ఉన్న ఖాజాకు భార్య సలీనా, ఏడాది వయసున్న కూతురు కౌసర్, నెల వయసున్న కుమారుడు ఉన్నాడు. మరో పదిరోజుల్లో నలభై రోజుల పరుడు చేసుకుని అబ్దుల్‌ బిలాల్‌గా నాయకరణం చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.     

కర్నూలు

  • జనవరి మొదటి వారం.. యాగంటి సమీపంలోని మలుపు వద్ద తెలంగాణ రాష్ట్రం గజ్వేల్‌ డిపోకు చెందిన విహార యాత్ర బస్సు వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో కర్నూలు చెందిన సుమన్, శిరీష, కుమారి మతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలకు గురయ్యారు.  
  • ఫిబ్రవరి మొదటి వారం..  
  • ఓర్వకల్లు గ్రామ శివారుల్లో ఆగి ఉన్న క్రూజర్‌ వాహనాన్ని వెనక నుంచి లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో క్రూజర్‌ వాహనం డ్రైవర్‌ రాఘవేంద్ర, కర్నూలు పట్టణానికి చెందిన బెస్త రాముడు, చిన్న రాముడు అక్కడికక్కడే మతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. 
  • మార్చి మూడో వారం.. 
  • గోనెగండ్ల మండలం వేముగోడు సమీపంలో జేసీబీ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో లింగందిన్నె గ్రామానికి చెందినబోయ లక్ష్మన్న, బోయ రాముడు, బోయ గోపాల్‌ అక్కడికక్కడే మతి చెందారు. మరో నలుగురు తీవ్ర గయాలకు గురయ్యారు. 
  • ఏప్రిల్‌ రెండో వారం..  
  • నందవరం మండలం హాలహర్వి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన మెకానిక్‌ మహబూబ్, పండ్ల వ్యాపారి ఖాజ, చిన్నారి షానవాజ్‌ మతి చెందారు. కారు అతి వేగంతో వెళ్తూ నిలబడిన ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది.  
  • మే 11వ తేదీ 
  • వెల్దుర్తి చెక్‌పోస్టు సమీపంలో ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు.. తుపాన్, మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టడంతో 16 మంది మతి చెందారు.   
  • పై ప్రమాదాలన్నీ అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణంగా జరిగాయని తెలుస్తోంది. వెల్దుర్తిలోకి మలుపు తిరుగుతున్న ద్విచక్రవాహనాన్ని ఓల్వో బస్సు తప్పించబోయి డోన్‌ వైపు నుంచి కర్నూలు వైపు వస్తున్న తూఫాన్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం దాటికి తూఫాన్‌ వాహనం బస్సులోకి దూసుకెళ్ళగా అందులో ప్రయాణిస్తున్న వారు భారీ సంఖ్యలో మతి చెందారు. ఓల్వో బస్సు ప్రమాద సమయంలో 150 కిలో మీటర్లు వేగంతో ఉన్నట్లు రవాణా శాఖ అధికారు లు ప్రాథమికంగా గుర్తించారు. విషయం తెలిసిన వెం టనే ఆర్టీఓ జగదీష్‌రాజు, మోటర్‌ వాహన తనిఖీ అధికారులు వెళ్ళి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.  

ప్రమాదానికి  డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణం 
వెల్దుర్తి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓల్వో బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణం. జాతీయ రహదారులగుండా వెళ్లేటప్పుడు గ్రామీణ రహదారులు, జంక్షన్లు, మలుపుల వద్ద జాగ్రత్తలు విధిగా పాటించాలి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు 150 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉంది. పూర్తిస్థాయిలో సంఘటనపై దర్యాప్తు చేస్తాం. ప్రమాదాల నివారణకు కోసం శాఖాపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.  – వర ప్రసాద్, ఎంవీఐ, కర్నూలు 

ప్రాణాలు తీస్తున్న అతివేగం, నిర్లక్ష్యం

జిల్లాలో తరుచూ జరుగుతున్న ప్రమాదాల తీరును చూస్తుంటే డ్రైవర్ల నిర్లక్ష్యం అతివేగమే ప్రాణాలు తీస్తున్నట్లు వెల్లడవుతోంది. ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవిస్తే కానీ అధికారులకు ప్రయాణీకుల భద్రత గుర్తుకు రాదు. అప్పటికప్పుడే ఏదో ఒక ప్రకటన చేసి ఊరు కుంటున్నారు. వాటి అమలు గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రతి ఏటా ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. వాహన చోదకుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రతి సంవత్సరం నిర్వహించే భద్రతా వారోత్సవాలు తూతూ మంత్రంగానే ముగుస్తున్నాయి. ఎక్కువ సార్లు ఒకే ప్రాంతంలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను రవాణా శాఖ అధికారులు బ్లాక్స్‌ స్పాట్లుగా 225 ప్రాంతాలను గుర్తించారు. నివారణ చర్యలకు ప్రభుత్వానికి నివేదిక పంపి మూడేళ్లు గడుస్తున్నా పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో ప్రమాదాలు ఎక్కువగా బ్లాక్‌ స్పాట్ల వద్దనే జరుగుతున్నాయి.

కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారిలో వెల్దుర్తి వద్ద, డోన్‌ శివారుల్లోని కంబాలపాడు జాతీయ రహదారి వద్ద ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకు సంబంధించిన నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారన్న అరోపణలు ఉన్నాయి. ప్రమాదాల నివారణ కోసం టోయింగ్, ఇంటర్‌సెస్టార్‌ వంటి ఆధునిక వాహనాలతో పాటు 13 రోడ్‌ సేఫ్టీ వాహనాలు, 2 ప్రచార వాహనాలను జిల్లాలో వినియోగిస్తున్నప్పటికీ ప్రమాదాలను నివారించలేకపోతున్నారు. జాతీయ, రాష్ట్ర, గ్రామీణ, అంతర్‌ గత రహదారులు మొత్తం 3,856 కిలో మీటర్ల మేర జిల్లాలో విస్తరించి ఉన్నాయి. జిల్లాలో 6 లక్షలకు పైగా అన్ని రకాల వాహనాలతో పాటు కర్ణాటక, తెలంగాణ  ప్రాంతాల నుంచి కూడా వాహనాలు ఈ రహదారులగుండా తిరుగుతున్నాయి. లారీలు, ఇతర వాహనాలు కూడా ఓవర్‌లోడ్‌తో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వాటిని కట్టడి చేయాల్సిన రవాణా శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారు ల్లో ఆటో ప్రయాణం నిషేధం ఉన్నప్పటికీ అధికారుల అలసత్వం వల్ల డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకుని వాయువేగంతో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. 

కన్నీళ్లకే కన్నీళ్లొస్తే! 

కర్నూలు(హాస్పిటల్‌): ఆమెకు బాల్యంలోనే పోలియో వచ్చి కాళ్లు చచ్చుపడిపోయాయి. అయినా ఆమెను పెళ్లి చేసుకుని పోషించాడు. అయితే కొన్నాళ్లకు అతనికి ఓ రోడ్డు ప్రమాదంలో కాళ్లు, నోరు, చెవులు పనిచేయకుండా పోయాయి. ఇప్పుడు ఆ దంపతులకు ఆధారంగా ఉన్న ఒకే ఒక్క కుమారుడు వెల్దుర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. దీంతో ఆ కుటుంబం బాధ వర్ణనాతీతంగా ఉంది. వెల్దుర్తి వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మతి చెందిన పరశురాముని(25) కుటుంబగాథ ఇది.

అతని తల్లి సోమేశ్వరమ్మకు బాల్యంలోనే పోలియో వచ్చి రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. ఆమెను పెళ్లాడిన మునిస్వామికి 20 ఏళ్ల క్రితం ప్రమాదంలో నోరు, చెవులు పనిచేయకపోగా, కాళ్లూ తెగిపోయాయి. ఈ కారణంగా ఈ కుటుంబానికి ఒక్కగానొక్క కుమారుడైన పరశురాముడే దిక్కయ్యాడు. అతను గౌండా పనిచేసుకుని తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. అతనికి ఐదేళ్ల క్రితం జయలక్ష్మితో వివాహమయ్యింది. వీరికి దీపిక(4), వికాస్‌(3) పిల్లలు. ఈ మొత్తం కుటుంబానికి పరశురాముడు మాత్రమే ఆధారం. శ్రీనాథ్‌కు గుంతకల్లులో పెళ్లి చూపుల కోసం వెళ్లి తిరిగి వస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం కన్నీటిపర్యంతమవుతోంది.
 
ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ 
రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలది ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ. అందరూ కూలీనాలీ చేసుకుని జీవించే ఎస్సీ కులానికి చెందిన వారు. రామాపురం గ్రామంలో 40 కుటుంబాలు వీరివి ఉన్నాయి. అందరూ అన్నదమ్ముల్లా కలిసి మెలసి జీవిస్తుంటారు. ఎవరింట శుభాశుభకార్యాలు జరిగినా తలోచేయి వేస్తారు. ఇప్పుడు కూడా రక్తసంబంధం కాకపోయినా ఒకే గోత్రం(అలగనూరు) కావడంతో కలిసిమెలసి జీవిస్తున్నారు. ఈ మేరకు శ్రీనాథ్‌కు పెళ్లి కుదరిచ్చేందుకు అందరూ కలిసి గుంతకల్లుకు వెళ్లారు. శ్రీనాథ్‌కు చిన్నతనంలోనే తండ్రి అనారోగ్యంతో కన్నుమూశాడు. ఈ కారణంగా అతని తరుపున చిన్నాన్న రాముడు వెళ్లాడు. అతనితో పాటు శ్రీనాథ్‌ తల్లి కూడా వెళ్లింది. వీరితో పాటు గ్రామంలోని పెద్దలంతా గుంతకల్లుకు వెళ్లి తిరుగుప్రయాణమై సగం మంది తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
 

  • మతుడు గోపీనాథ్‌(25)కు పెళ్లికాలేదు. ఇటీవలే అతనికి తల్లిదండ్రులు మునిస్వామి, ఇందిరమ్మ పెళ్లి కుదిర్చారు. మరో పదిరోజుల్లో పెళ్లి కూడా నిశ్చయించారు. ఈ మేరకు శుక్రవారం ఇంటికి రంగులు కూడా వేయించారు. ఈలోపు గోపీనాథ్‌ రోడ్డు ప్రమాదంలో మతి చెందడం ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.  
  • మునిస్వామి(30)కి కూడా పెళ్లికాలేదు. అతను కూలీపనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు.  
  • భాస్కర్‌(35) తండ్రి గతంలో మరణించాడు. తల్లి మాత్రమే ఉంది. అతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భర్తతో పాటు భార్య కూడా కూలీపనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తుంది. ఇప్పుడు కుటుంబానికి పెద్దదిక్కు అయిన భాస్కర్‌ ప్రాణాలు కోల్పోయాడు.  
  • ప్రమాదంలో కూలీపని చేసుకుని జీవించే తిక్కన్న(30), అతని తండ్రి చింతలన్న(55) కన్నుమూశారు. తిక్కన్నకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబంలో ఇద్దరూ మగవారు ప్రాణాలు కోల్పోవడంతో మాకు దిక్కెవరని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.  
  • చిన్నసోమన్న(40), శాలన్న(35)లు ఇద్దరూ అన్నదమ్ముల పిల్లలు(దాయాదులు). ఇద్దరూ కూలీ పనికి వెళ్లి కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇద్దరూ ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి.  
  • ప్రమాదంలో మరణించిన సురేష్‌(29) సైతం కూలీ పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భార్య ప్రస్తుతం నిండు గర్భిణి. సురేష్‌ ప్రాణాలు కోల్పోవడంతో ఆ విషయాన్ని భార్యకు ఎలా చెప్పాలా అని కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు.  
  • డ్రైవర్‌ రంగస్వామి స్వగ్రామం పచ్చర్ల. అయితే అతను కొంతకాలంగా శాంతినగర్‌కు వచ్చి నివాసముంటూ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. శనివారం రామాపురం గ్రామస్తులకు బాడుగ మాట్లాడుకుని వెళ్లి తిరిగి వస్తూ ప్రాణాలు కోల్పోయాడు. మతుడు పౌలన్న(45) స్వగ్రామం ఐజ సమీపంలోని పులికల్లు. అయితే ఆయన భార్య నాగేశ్వరమ్మ స్వగ్రామం రామాపురంలో పెళ్లి అయినప్పటి నుంచి ఉంటూ అక్కడే జీవనం సాగిస్తున్నాడు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో మొత్తం కుటుంబం రోడ్డునపడ్డట్లయ్యింది.
మరిన్ని వార్తలు