వ్యాపారవేత్త జయరామ్‌ అనుమానాస్పద మృతి

2 Feb, 2019 05:28 IST|Sakshi

కృష్ణా జిల్లా ఐతవరం వద్ద కారులో మృతదేహం లభ్యం

మిస్టరీగా కేసు నమోదు చేసిన నందిగామ పోలీసులు

పలు కోణాల్లో దర్యాప్తు

కుటుంబ సభ్యుల నుంచి వివరాల సేకరణ

సాక్షి, అమరావతిబ్యూరో/నందిగామ: ప్రముఖ వ్యా పారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్‌ (55) అనుమానాస్పదంగా మృతి చెందారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద కారులో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇతర డాక్యుమెంట్లను పరిశీలించిన పోలీసులు.. కారులోని మృతదేహం చిగురుపాటి జయరామ్‌దేనని గుర్తించారు. కార్లో వెనక సీట్లో కూర్చున్న ఆయన తలపై బలమైన గాయాలున్నాయి. రోడ్డు ప్రమాదం జరిగిన దాఖలాల్లేవు. కారులో మద్యం సీసాలు లభ్యమయ్యాయి. 

బెజవాడ టు అమెరికా
బెజవాడ వాసి అయిన జయరామ్‌.. 1984 నుంచి 1988 వరకు హైదరాబాద్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1993లో అమెరికాకు వెళ్లారు. న్యూయార్క్‌లోని కోర్నెల్‌ వర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. తర్వాత వ్యాపారం రంగంలోకి దిగారు. అక్కడే స్థిరపడి అంచలంచెలుగా ఎదిగారు. అమెరికాలోనే సొంతంగా ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేసి.. విజయవంతంగా నడిపించారు. ఫ్లోరిడాలోని సైప్రెస్‌ క్యాపిటల్‌ గ్రూప్‌ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. భారత్‌కు కూడా తన వ్యాపారాన్ని విస్తరించారు. ఆయన కంపెనీలకు చెందిన ఫార్మా ఉత్పత్తులను 35 దేశాల్లోని పలు సంస్థలు దిగుమతి చేసుకుంటున్నాయి. భారత్‌లో కోస్టల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 2012 నుంచి 2018 మే వరకు త్రిమూర్తి ప్లాంట్‌ సైన్స్‌కు చైర్మన్‌గా ఉన్నారు. 2011 నుంచి నేటి వరకు టెక్‌ట్రాన్‌ పాలీలీనెస్‌ లిమిటెడ్‌కు ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నారు. 2012 నుంచి నేటి వరకు హెమారస్‌ థెరప్యూటీక్స్‌ లిమిటెడ్‌కు చైర్మన్‌గా ఉన్నారు. ఫ్లోరిడాలోని సైప్రెస్‌ ట్రస్ట్‌ కంపెనీకి చైర్మన్, సీఈవోగా సేవలందిస్తున్నారు. జయరామ్‌ ఎక్స్‌ప్రెస్‌ టీవీని కూడా స్థాపించారు. తర్వాత నష్టాలు రావడంతో దాన్ని మూసేశారు. 2017 జనవరిలో జయరామ్‌పై బెంగళూరులో కేసు నమోదైంది. ఎక్స్‌ప్రెస్‌ టీవీ మాజీ ఉద్యోగులు జీతాల చెల్లింపుల విషయంలో ఏర్పడిన తగదాల వల్లే ఆయనపై క్రిమినల్‌ కేసు పెట్టారని పోలీసులు చెబుతున్నారు. 

అసలేం జరిగింది?
రెండ్రోజుల క్రితం జయరామ్‌ హైదరాబాద్‌ నుంచి విజయవాడ బయల్దేరినట్లు.. ఆయనతో పాటు మరో వ్యక్తి కూడా కారులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జయరామ్‌ కుటుంబం ప్రస్తుతం అమెరికాలో నివాసముంటుండగా.. ఆయన తల్లిదండ్రులు విజయవాడ కానూరులో ఉంటు న్నారు. హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి బుధవారం జయరామ్‌ ఒక్కరే స్వయంగా కారు డ్రైవ్‌ చేసుకుని వెళ్లారు. అప్పటి నుంచి ఆయన ఎవరికీ ఫోన్‌లో అందుబాటులో లేరు. గురువారం సాయంత్రం తాను విజయవాడ వస్తున్నానని బస కు ఏర్పాట్లు చేయాల్సిందిగా తన సిబ్బందికి మెసేజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన ఫోన్‌ నుంచి వెళ్లిన చివరి మేసేజ్‌ అదే.

తరువాత కొద్ది గంటల్లోనే ఆయనను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టోల్‌గేట్ల వద్ద సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు కారులో తెల్లదుస్తులు ధరించిన ఓ వ్యక్తి డ్రైవింగ్‌ చేస్తూ కనిపించారు. జయరామ్‌ ఎక్కడెక్కడికి వెళ్లారు? ఎవరెవరిని కలిశారు? విజయవాడకు వస్తుండగా అతని కారును డ్రైవింగ్‌ చేసిన గుర్తు తెలియని వ్యక్తి ఎవరు? హత్యకోణం, ఆస్తితగాదాలు ఇలా అనేక కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, జయరామ్‌ మృతదేహానికి నందిగామలో పోస్టుమార్టం జరిపించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పరిశీలించారు. కేసు విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు