డీజే సౌండ్‌తో గుండెపోటుకు గురై మహిళ మృతి.. డీజే ఏర్పాటు చేసింది?

29 Nov, 2023 13:10 IST|Sakshi
అమృతమ్మ(ఫైల్‌)

కొండమల్లేపల్లి: దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లిలో ఓ రాజకీయ పార్టీ ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో డీజే సౌండ్‌ కారణంగా ఓ మహిళ గుండెపోటుకు గురై మృతి చెందింది. కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన గుంటోజు అమృతమ్మ(51) దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి రోడ్‌ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోర్‌ పిన్‌ డిజే సౌండ్స్‌తో తీవ్రమైన శబ్దాన్ని తట్టుకోలేక అమృతమ్మ గుండెపోటుకు గురై కుప్పకూలింది. దీంతో స్థానికులు ఆమెను దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అమృతమ్మను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు ఏమీ అందలేదని పోలీసులు తెలిపారు.

కోళ్ల దాణా లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా
మాడుగులపల్లి: కోళ్ల దాణా బస్తాల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటన మాడుగులపల్లి మండల పరిధిలోని టోల్‌ప్లాజా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా నుంచి కోళ్ల దాణా(సోయాపొట్టు) బస్తాల లోడ్‌తో లారీ ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాకు బయల్దేరింది.

మార్గమధ్యలో మాడుగులపల్లి టోల్‌ప్లాజా సమీపంలో రోడ్డు దిగుడుగా ఉండడాన్ని డ్రైవర్‌ గుర్తించకపోవడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌, క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. దాణా బస్తాలను మరో లారీలోకి లోడ్‌ చేసి క్రేన్‌ సాయంతో బోల్తా పడిన లారీని పైకెత్తారు.

మరిన్ని వార్తలు