ఆపరేటర్‌ను బలిగొన్న కేబుల్‌ ధరల పెంపు

18 Feb, 2019 04:59 IST|Sakshi
గిరిజాశంకర్‌ మృతదేహం 

సూసైడ్‌ నోట్‌ రాసి బలవన్మరణం

గుంటూరు జిల్లాలో ఘటన

సిటీకేబుల్‌ ఆఫీసు ముందు ఆందోళనకు దిగిన ఆపరేటర్లు 

లక్ష్మీపురం(గుంటూరు): కేబుల్‌ ధరల పెంపు నిర్ణయంతో మనస్తాపం చెందిన ఓ ఆపరేటర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా రెడ్డిపాలెం శివారులో ఆదివారం ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు అరండల్‌పేటకు చెందిన చామర్తి గిరిజాశంకర్‌ (44) 1995 నుంచి డొంకరోడ్డు వద్ద గల వసంతరాయపురం కేబుల్‌ ఆపరేటర్‌గా వ్యవహరిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కేబుల్‌ ధరల పెంపుపై గత కొన్ని రోజులుగా కేబుల్‌ ఆపరేటర్స్‌ సిటీకేబుల్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు.

కేబుల్‌ ధరలు రూ.200 నుంచి రూ.800 వరకు పెరిగిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడటంతో పాటు కేబుల్‌ ఆపరేటర్ల జీవితాలు రోడ్డు పాలవుతాయని ఆందోళన చెందిన గిరిజాశంకర్‌ ఆదివారం రెడ్డిపాలెం గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్‌ నోట్‌ కూడా రాసి ఉంచాడు. ‘నేను కేబుల్‌ వ్యాపారిని. నా వ్యాపారం లేకపోతే నేను లేనట్టే. నేను చాలా టెన్షన్‌ పడుతున్నాను నా వారికి న్యాయం చేయలేనని. నా కేబుల్‌ ఏరియాను ఎవరైనా పెద్ద మనుషులు తీసుకుని నా కుటుంబానికి న్యాయం చేయండి.. కేబుల్‌లోనే ఉన్నా.. కేబుల్‌తోనే పోతా.. క్షమించండి. నా కుటుంబానికి న్యాయం చేయండి. నా చావుతోనైనా ఎంఎస్‌ఓలు మారుతారని కోరుకుంటున్నాను.’ అని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.

కాగా మృతుడు గిరిజాశంకర్‌కు భార్య పద్మ, కుమారుడు గోపీచంద్‌ ఉన్నారు. సిటీ కేబుల్‌ ఆపరేటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.శ్రీనివాసరావు, కార్యదర్శి శంకరరావు, శ్రీనివాసరావు, సురేష్‌లతో పాటు గుంటూరు కేబుల్‌ ఆపరేటర్స్‌ అందరూ ప్రభుత్వ సమగ్రాస్పత్రికి చేరుకున్నారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సిటీకేబుల్‌ ట్రాయ్‌ నిబంధనల ప్రకారం ధరలు పెంచడంతో మూడు రోజులుగా రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నామన్నారు. తోటి ఆపరేటర్‌ ఆత్మహత్య చేసుకున్నాడని, ఇంత జరుగుతున్నా సిటీ కేబుల్‌ యాజమాన్యం కానీ, ఎంఎస్‌వోలు కాని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. సిటీకేబుల్‌ యాజమాన్యం ఇదే తరహాలో ఉంటే మృతుడు శంకర్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా 600 మంది కేబుల్‌ ఆపరేటర్లకూ ఇలాంటి పరిస్థితే ఏర్పడుతుందన్నారు. కేబుల్‌ ఆపరేటర్లు అందరూ ఆపరేటర్‌ మృతికి నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి పండరీపురంలోని సిటీకేబుల్‌ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు