టీడీపీ నేత బాలకృష్ణ సహా ఏడుగురిపై కేసు నమోదు

31 Mar, 2018 11:31 IST|Sakshi
ఆందోళనకు దిగిన శివారెడ్డి బంధువులు. ఇన్‌సెట్లో నిందితుడు బాలకృష్ణతో పరిటాల శ్రీరామ్ (ఫైల్ ఫొటో)

సాక్షి, అనంతపురం: ఏపీ మంత్రి పరిటాల సునీత హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గం కందుకూరులో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త శివారెడ్డి దారుణహత్యకు గురికావడమే అందుకు నిదర్శనమన్నారు. మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేసినా మంత్రి సునీత, ఆమె కుటుంబీకులపై పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. మంత్రి పరిటాల సునీత అండతోనే శివారెడ్డి హత్య జరిగిందని, ప్రాణహాని ఉందని మొరపెట్టుకున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. మంత్రి ఆదేశాలతో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందంటూ ఆయన మండిపడ్డారు.

సునీతపై కుటుంబీకులపై కేసు నమోదు చేయలేదు 
వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త శివారెడ్డి దారుణహత్యపై ఆయన కుటుంబీకులు ఫిర్యాదు చేయగా ప్రధాన నిందితుడు, టీడీపీ నేత బాలకృష్ణ సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ మంత్రి సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాం, వారి సమీప బంధువులు మురళీ, మహేంద్ర అండతోనే హత్య చేశారని ఫిర్యాదులో పేర్కొన్నా.. వీరిపై మాత్రం కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనకడుగు వేస్తున్నారు. కాగా, ఇటుకలపల్లి నుంచి కందుకూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివారెడ్డిని శుక్రవారం టీడీపీ కార్యకర్తలు కాపుకాసి వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప నేతలు, కార్యకర్తల హత్యలకు పాల్పడటం దారుణమని తోపుదుర్తి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు