చైన్‌స్నాచింగ్‌లో ఘనుడు

8 Aug, 2018 10:59 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న బంగారు చైన్లు( అచ్యుత్‌ కుమార్‌)

 కరుడుగట్టిన నేరగాడు అరెస్ట్‌

రూ. కోటి విలువైన నగలు స్వాధీనం

యశవంతపుర : చైన్‌స్నాచింగ్‌ల్లో ఆరితేరిన నేరస్తుడిని కెంగేరి పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి అతని వద్ద నుంచి రూ. కోటి విలువైన 3.5 కేజీల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ధారవాడ జిల్లా హుబ్బళ్లి తాలూకా కోళివాడకు చెందిన అచ్యుత్‌ కుమార్‌ గణి అలియాస్‌ విశ్వనాథ్‌ కోళివాడ్‌ను అరెస్ట్‌ చేశారు. ఇక్కడి కెంగేరిలో నివాసం ఉంటున్న అచ్యుత్‌ అరెస్ట్‌తో 105 చైన్‌స్నాచింగ్‌ కేసులు బయటపడ్డాయి.  బెంగళూరు పశ్చిమ విభాగంలో 37, నగర విభాగంలో 40, బళ్లారి జిల్లాలో 10, తుమకూరు జిల్లాలో 6, బెంగళూరు గ్రామీణ జిల్లా 4, హసన జిల్లాలో 3, రామనగర జిల్లా 2, ధారవాడ జిల్లాలో 2, దావణగెరె జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. చోరీ సొత్తును నిందితుడు కొప్పళకు చెందిన స్నేహితుడు గవి సిద్దేశ్‌కు అమ్మేవాడు. దీంతో ఇతన్ని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెంగళూరు నగరంలో స్నాచింగ్‌లు ఎక్కువ కావటంతో కమిషనర్‌ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

నిఘా పెట్టిన బృందాలు మంగళవారం అచ్యుత్‌ ఆచూకీ కెంగేరిలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు పట్టుకోవడానికి యత్నించారు. దీంతో అచ్యుత్‌ మారణాయుధాలతో పోలీసులపై ఎదురుదాడికి దిగాడు. దీంతో కెంగేరి సీఐ కాల్పులు జరపడంతో అచ్యుత్‌ పడిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. అచ్యుత్‌కుమార్‌పై హుబ్లీ నగర, హవేరి, గదగ, ఉత్తరకన్నడ జిల్లా 34 కేసుల్లో నిందితుడు. 18 కేసులకు సంబంధించి అరెస్టు వారెంట్‌ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దోపిడీలకు ఉపయోగించిన 5 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇతని భార్య మహదేవి కూడ భర్తను దొంగతనాలకు పోత్సాహించేది. ప్రస్తుతం ఆమె తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. జనవరిలో హోవిన హడగలి వద్ద స్కార్పియోలో వెళ్లతుండగా పోలీసుల కంట పడి తప్పించుకున్నాడు. కారును అక్కడే వదిలి వెళ్లటంతో అందు మూడు లక్షల నగదు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2009 నుండి దొంగతనాలు చేస్తూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అచ్యుత్‌ను కరుడు గట్టిన నేరస్థుడిగా పోలీసులు ప్రకటించారు. జూన్‌ 17న జ్ఞాననభారతి కానిస్టేబుల్‌ చంద్రకుమార్‌ పట్టుకునే క్రమంలో తప్పించుకుని పారిపోయాడు. నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులను సిటీ పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ కుమార్‌ అభినందించారు. 

మరిన్ని వార్తలు