కళ్లల్లో కారం చల్లి గొలుసు చోరీ

24 Dec, 2019 11:57 IST|Sakshi
బాధితురాలితో మాట్లాడుతున్న సీఐ, ఎస్‌ఐ

ప్రకాశం,పెదకండ్లగుంట (కొండపి): మండలంలోని పెదకండ్లగుంటలో పొలానికి వెళ్లిన ఇద్దరు మహిళల కళ్లల్లో కారం కొట్టిన ఆగంతకుడు ఒకరి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన సంఘటన సోమవారం జరిగింది. బాధితురాలు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొల్లా రమణమ్మ తన తోటి కోడలు నారాయణమ్మతో కలిసి గ్రామానికి దక్షిణం పైపున ఉన్న తమ పొలంలో సాగు చేసిన కంది, శనగ పైరును చూసేందుకు బయల్దేరారు. పెదకండ్లగుంట–ఇలవర మెటల్‌ రహదారి మీదగా గ్రామానికి సుమారు కిలోమీటరు దూరం నడిచిన తర్వాత ద్విచక్ర వాహనంపై ఆగంతకుడు వారిని రెండుసార్లు దాటి వెనక్కి ముందుకు వెళ్లాడు. మహిళలను మూడోసారి క్రాస్‌ చేస్తూ వెనుక నడుస్తున్న నారాయణమ్మ కళ్లల్లో ముందుగా కారం కొట్టాడు.

ఆమె అరుస్తూ కళ్లు నలుపుకుంటుండగా ముందు నడుస్తున్న  రమణమ్మ కళ్లల్లో సైతం కారం కొట్టాడు. అమాంతం ఆమె మెడలోని 2.5 సవర్ల బంగారు చైనును లాక్కున్నాడు. రమణమ్మ సైతం అరుస్తూ ఆగంతకుడి చొక్కా పట్టుకోగా గింజుకుని చొక్కాను వదిలించుకుని పొలాల్లో నుంచి కొత్తపాలెం వైపు పారిపోయాడు. మహిళల అరుపులు విన్న పక్క పొలాల్లోని కొందరు వచ్చి గ్రామస్తులకు ఫోన్‌లో సమాచారం అందించారు. ఆంగంతకుడు బ్లూ టీషర్ట్, లుంగీ కట్టుకుని ఉన్నాడని, బట్టతల కూడా ఉందని బాధిత మహిళలు చెప్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. చుట్టు పక్కల గాలించినా నిందితుడి ఆచూకీ దొరకలేదు. విషయం తెలుసుకున్న సింగరాయకొండ సీఐ టీఎక్స్‌ అజయ్‌కుమార్‌ సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. అనంతరం బాధితులు, గ్రామస్తులతో మాట్లాడారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు