మొన్న ప్రేమ.. నిన్న పెళ్లి.. నేడు విడాకులు

1 Jun, 2019 07:47 IST|Sakshi
యర్రంశెట్టి రమణగౌతం

యువతిని మోసగించిన సినీ రచయిత  

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

బంజారాహిల్స్‌:ప్రేమించానని బాసలు చేశాడు. ఆపై సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి అందినకాడికి దండుకున్నాడు. పెళ్లిమాట ఎత్తేసరికి ముఖం చాటేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా జైలుకు పోతానేమోనన్న భయంతో గుడిలో తాళికట్టాడు. తీరా కాపురం దగ్గరికి వచ్చేసరికి పెళ్లి జరిగిన మొదటి రాత్రే చెప్పాపెట్టకుండా పరారయ్యాడు. ఇదేమిటని బాధితురాలు నిలదీస్తే నువ్వు నాకొద్దు అంటూ పెళ్లి చేసుకున్న మరుసటి రోజే విడాకులు తీసుకుంటానని చెప్పాడు. దీంతో ఖిన్నురాలైన బాధితురాలు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. వైజాగ్‌ ఎంవీపీ కాలనీలో నివసించే యర్రంశెట్టి రమణగౌతం (28) బుల్లితెరతో పాటు వెండితెరకు కథలు రాస్తూ ఫిలింనగర్‌లో గత ఆరేళ్లుగా అద్దెకుంటున్నాడు. చాలా బుల్లితెర కథలు రాసి పేరు తెచ్చుకున్నాడు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఎన్బీటీనగర్‌లో నివసించే యువతి (23) వెండితెర మీద వెలిగిపోవాలని సినిమాలపై మోజుతో స్టూడియోల చుట్టూ తిరుగుతున్న సమయంలో ఆమెకు రమణగౌతంతో పరిచయం ఏర్పడింది. సినిమాల్లో ఛాన్స్‌ ఇప్పిస్తానంటూ ఆమెను ప్రేమలోకి లాగాడు.

2016లో ఏర్పడిన వీరి పరిచయం తర్వాత ప్రేమకు, ఆ తర్వాత సహజీవనానికి దారి తీసింది. ఆమెకు ఉద్యోగ అవకాశాలు రావడంతో దుబాయ్, సింగపూర్, బెహ్రాన్‌ దేశాలకు వెళ్లింది. అక్కడ సంపాదించిన డబ్బును పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రమణగౌతంకు పంపించేది. 2017 ఫిబ్రవరిలో ఇద్దరూ ఉంగరాలు కూడా మార్చుకున్నారు. అయితే ఇటీవల పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తేగా ససేమిరా అన్నాడు. దీంతో మే 24న ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు సమాచారం అందుకొని రమణగౌతంను స్టేషన్‌కు పిలిపించారు. సహజీవనం చేయడంతో పెళ్లి చేసుకోవాలని వారు సూచించడంతో మే 26న బంజారాహిల్స్‌లోని ఓగుడిలో తాళికట్టాడు. అదే రోజు రాత్రి సిగరెట్‌ తాగి వస్తానని బయటికి వచ్చి అటు నుంచి అటే ఉడాయించాడు. ఆ తెల్లవారి ఫోన్‌ చేసి నువ్వు నాకు వద్దు విడాకులు తీసుకుందామని చెప్పాడు. దీంతో ఆమె షాక్‌తిని తన భర్త కనిపించడం లేదంటూ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసగించాడని రమణపై చర్యలు తీసుకోవాలంటూ కోరింది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా