గిఫ్ట్‌ వచ్చింది పట్టుకెళ్లండి

6 Feb, 2020 08:08 IST|Sakshi

లక్కీడ్రా పేరుతో పలు మోసాలు   

పోలీసులకు చిక్కిన నిందితులు  

పంజగుట్ట: ‘మీకు గిఫ్ట్‌ వచ్చింది. మా కార్యాలయానికి కుటుంబ సమేతంగా వచ్చి  తీసుకెళ్లండి’ అంటూ మోసం చేస్తున్న పలువురిని పంజగుట్ట పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పుగూడకు చెందిన శ్రీకాంత్, ఓల్డ్‌ బోయిన్‌పల్లికి చెందిన అబ్దుల్‌ రషీద్‌ఖాన్‌ తదితరులు పంజగుట్ట నాగార్జున సర్కిల్‌లో డెస్టినీ ఇన్‌ఫా సర్వీసెస్‌ పేరుతో సంస్థను స్థాపించారు. దీనికి శ్రీకాంత్‌ సీఈఓగా, రషీద్‌ఖాన్‌ ఎండీగా వ్యవహరిస్తున్నారు. సంస్థకు చెందిన ఉద్యోగులు బిగ్‌బజార్, మెట్రో, డీమార్ట్‌ తదితర షాపింగ్‌ మాల్స్‌ వద్ద ఉంటారు. షాపింగ్‌ చేసేందుకు వచ్చిన వారికి ఒక కూపన్‌ ఇస్తారు. అందులో పేరు, ఫోన్‌ నంబర్‌ రాస్తే మీకు గిప్ట్‌ వస్తుందని వివరాలు తీసుకుంటారు. ఒక వారం తర్వాత వారికి ఫోన్‌ చేసి లక్కీడ్రాలో మీ పేరు వచ్చింది. మీ భార్యను తీసుకుని మా సంస్థకు వచ్చి గిఫ్ట్‌ తీసుకువెళ్లండని చెబుతారు. వెళ్లినవారికి సమోసా తినిపించి, టీ తాగిస్తారు, కప్పులు, సాసర్లు ఉన్న ఒక గిఫ్ట్‌ ఇస్తారు. ఆ తర్వాత అసలు కథ మొదలుపెడతారు. తాము తక్కువ రేటులో విదేశాలకు పంపిస్తాం. పాస్‌పోర్టు, వీసా అన్నీ తామే చూసుకుంటామని నమ్మబలుకుతారు. దానికి ఒప్పుకోకపోతే అతితక్కువ రేటుకు ఫ్లాట్స్‌ ఇస్తామని నమ్మిస్తారు. రూ.50 వేలు లేదా రూ.30 వేలు కట్టినా ఫ్లాట్‌ మీ సొంతం అవుతుందంటారు. కట్టిన తర్వాత నేడు రేపు అని తిప్పించుకుంటారు. 

మోసం వెలుగుచూసిందిలా..
ఇదే తరహాలో జియాగూడకు చెందిన సారిక 15 రోజుల క్రితం అత్తాపూర్‌లోని డీమార్ట్‌కు వెళ్లగా అక్కడ ఆమె వివరాలు తీసుకున్నారు. గిఫ్ట్‌ వచ్చిందని సంస్థకు పిలిపించారు. సారిక ఆమె భర్త ప్రమోద్‌తో కలిసి వెళ్లగా షాద్‌నగర్‌లో 121 గజాల ఫ్లాట్‌ ఇస్తామని నమ్మబలికి రూ.30వేలు తీసుకున్నారు. అసలు వెంచర్‌ చూపించకుండా మాటల్లో పెట్టి రూ.30 వేలు తీసుకోవడంతో అనుమానం వచ్చిన వారు బుధవారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌ రెడ్డి సంస్థ కార్యాలయంపై ఆకస్మిక తనిఖీలు చేసి శ్రీకాంత్, అబ్బుల్‌ రషీద్‌ఖాన్‌ సహా సీనియర్‌ సేల్స్‌ ఏజెంట్‌ మీర్జా అజీజ్‌బేగ్, సేల్స్‌ విభాగానికికి చెందిన సయ్యద్‌ సుభాన్, దండు నవీన్‌కుమార్, రాహుల్, సయ్యద్‌ ఫజల్‌లను అరెస్టు చేశారు. వీరి బాధితులు ఎవరైనా ఉంటే పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్‌ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు