ఆశలు సమాధి చేసి..

16 Jun, 2018 10:22 IST|Sakshi
మమత, నాగరాజుల పెళ్లి నాటి ఫొటో

ఉరివేసుకున్న భార్య

తట్టుకోలేక విషం తాగిన భర్త

అనాథలైన ఇద్దరు పిల్లలు

వారిద్దరు.. వారికిద్దరు.. చింతలేని కుటుంబం. కష్టపడి సొంతిల్లు కట్టుకున్నారు.. జీవితంలో ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నారు. కానీ భార్యభర్తల మధ్య తలెత్తిన చిన్న మనస్పర్థలు ఇపుడా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. క్షణికావేశంలో ఆ దంపతులు తీసుకున్న నిర్ణయంతో లోకమెరుగని వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.

హిందూపురం అర్బన్‌/రూరల్‌: మడకశిర మండలం కల్లుమర్రికి చెందిన నాగరాజు(38)కు హిందూపురం మండలం వినాయకనగర్‌కు చెందిన మమత(30)తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి తొమ్మిదేళ్ల కుమారుడు భానుతేజ, నాలుగేళ్ల మనసతేజ సంతానం. మమత కిరికెరలోని ఎస్సీ కాలనీ అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తుండగా... నాగరాజు వాటర్‌ ప్లాంట్‌ పరికరాలు సరఫరా చేసే కంపెనీలో ఫిల్డ్‌మెన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. జీవితంపై ఎన్నో ఆశలు..ఆకాంక్షలతో ఇద్దరూ కష్టపడి పనిచేసేవారు. సెరికల్చర్‌ కాలనీలో సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు. అయితే ఇటీవల దంపతుల మధ్య మనస్ఫర్థలు వచ్చాయి చీటికిమాటికీ నాగరాజు మమతతో గొడవకు దిగేవాడు.

ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం కూడా భర్యాభర్తలు గొడవపడ్డారు. అనంతరం నాగరాజు తన విధులకు వెళ్లిపోగానే... పిల్లలిద్దరినీ స్కూల్‌కు పంపిన మమత... ఇంట్లోని ఫ్యాన్‌ కొక్కికి చీరతో ఉరివేసుకుంది. చుట్టుపక్కలవారు గమనించే సరికే ఆమె మృతి చెందింది. ఈ విషయాన్ని వారు ఫోన్‌ద్వారా నాగరాజుకు తెలపడంతో అతను కల్లుమర్రికి వెళ్లిపోయాడు. తన భార్య ఆత్మహత్యకు తానే కారణమయ్యానని కుమిలిపోయాడు. భార్య లేని జీవితం ఊహించులోక సాయంత్రం వేళ పురుగుల మందు తాగి తాగేశాడు. అపస్మరకస్థితిలో పడిఉన్న నాగరాజును అక్కడి వారు గమనించి హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగరాజు చనిపోయాడు. 

మార్చురీలో దంపతుల మృతదేహాలు
మమత, నాగరాజుల మృతదేహాలకు పోస్టుమార్టం చేయించేందుకు పోలీసులు మార్చురీకి తరలించారు. అంతవరకూ తమ కళ్లముందున్న దంపతులు ఇపుడు పక్కపక్కనే నిర్జీవంగా కనించే సరికి వారి కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఒక క్షణం పిల్లల గురించి ఆలోచించి ఉన్నా.. ఇంతటి ఘోరం జరిగేదికాదని బంధువులు వాపోతున్నారు.

అమ్మమ్మగారింట్లో ఇద్దరు చిన్నారులు
నాగరాజు, మమత దంపతుల పిల్లలు భానుతేజ, మానసతేజ  ప్రస్తుతం అమ్మమ్మ గారింట్లో ఉన్నారు. మమత ఆత్మహత్య విషయం తెలియగానే కుటుంబీకులు స్కూళ్లో ఉన్న చిన్నారులిద్దరినీ వారి అమ్మమ్మ వాళ్లింటికి తీసుకువెళ్లారు. తల్లిదండ్రులిద్దరూ మృత్యువాత పడిన విషయం వారికింతవరకూ తెలియనివ్వలేదు. కానీ రేపు తమ అమ్మా,నాన్న లేరని తెలిస్తే ఆ పిల్లల పరిస్థితి ఏమౌతుందోనని బంధువులు, కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు