సైనేడ్‌ కిల్లర్‌కు మరణశిక్ష

25 Oct, 2019 07:33 IST|Sakshi
హంతకుడు సైనేడ్‌ మోహన్‌

మంగళూరు యువతిని బెంగళూరులో విషం కలిపి చంపిన కేసు..

మంగళూరు కోర్టు తీర్పు వెల్లడి

సైకో మోహన్‌ ఆటకట్టు  

ఇప్పటివరకు సైనేడ్‌తో 20 మంది మహిళల హత్య  

మహిళ కనిపిస్తే మాటలు కలుపుతాడు. తానో పెద్ద మనిషినని, మీ కష్టాలు తీర్చేస్తానని నమ్మిస్తాడు. షికార్లకు తీసుకెళ్లడం, తలనొప్పి మాత్ర పేరుతో సైనేడ్‌ ఇచ్చి ప్రాణాలు తీయడం అతనికి మంచినీళ్లు తాగినంత సులభం. ఆపై నగలు, డబ్బుతో ఉడాయిస్తాడు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మంది వనితల ఉసురు తీసినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నా యి. బెంగళూరులో ఓ యువతి హత్య కేసులో మరోసారి మరణశిక్ష తీర్పు వెలువడింది.  

కర్ణాటక, యశవంతపుర: యువతిని అత్యాచారం చేసి హత్య కేసులో మానవ మృగాడు, సైకో కిల్లర్‌ సైనేడ్‌ మోహన్‌ కుమార్‌ (56)కు మరణ శిక్ష ఖరారయింది.  మంగళూరులోని ఆరో అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. మహిళపై అత్యాచారం కేసులో అతనిపై నేరారోపణలు రుజువయ్యాయి. విచారణ పూర్తి కావడంతో బుధవారం న్యాయమూర్తి జస్టిస్‌ సయిదున్నిసా గురువారం శిక్ష ఖరారు చేస్తానని తెలిపారు. గురువారం తీర్పు వెలువరిస్తూ మోహన్‌కు మరణ శిక్షను ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాష్ట్ర హైకోర్టు ఈ తీర్పును ధృవీకరించిన తరువాత మరణ శిక్ష అమలు చేయాలని తెలిపారు. హైకోర్టు మరణ శిక్షను ధృవీకరిస్తే ఇతర నేరాల్లో కోర్టులు అతనికి విధించిన శిక్షలను కూడా ఇందులోనే కలిపేయాలని ఆదేశించారు. మొత్తం 17 కేసులకు గాను నాలుగింటిలో అతనికి మరణ శిక్ష ఖరారు అయింది. 

బెళగావి జైలు నుంచి వీసీ ద్వారా   
హంతకుడు మోహన్‌ ప్రస్తుతం బెళగావిలోని హిండల్గా సెంట్రల్‌ జైలులో ఉన్నాడు. అక్కడ నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యాడు. అతడు పాల్పడిన నేరం దృష్ట్యా మరణ శిక్షకు అర్హుడని ప్రభుత్వ న్యాయవాది జుడిత్‌ ఓల్గా వాదనలు వినిపించారు. మధ్యాహ్నం న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. తీర్పును ముద్దాయి ఎలాంటి స్పందన లేకుండా ప్రశాంతంగా ఆలకించాడు. 

తాజా కేసు ఇదీ  
సుమారు పదేళ్ల కిందట... దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ తాలూకా బాళెపుణి అంగనవాడిలో సహయకురాలిగా పని చేస్తున్న యువతిని పరిచయం చేసుకుని, ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చి మెజెస్టిక్‌ వద్ద లాడ్జిలో దిగారు. మరుసటి రోజుకు ఆమెకు గర్భనిరోధక మాత్రలంటూ సైనేడ్‌ఇచ్చాడు. ఆమె నగలు, డబ్బుతో పరారయ్యా డు. సైనైడ్‌ మింగిన యువతి కొంతసేపటికే మరణించింది. మరో కేసులో అతన్ని పట్టుకుని విచారిస్తుండగా నేరం బయటపడింది. 

నరహంతకుడు  
అతనికి మహిళలకు మాయమాటలు చెప్పి లోబరుచుకోవడం, డబ్బుదస్కంతో ఉడాయించడం నైజం. వెళ్తూ వెళ్తూ సైనైడ్‌తో మట్టుబెట్టడంలో ఆరితేరాడు. సుమారు 20 మంది అమాయ మహిళలను ఇలా హత్య చేసినట్లు ఇతనిపై ఆరోపణలున్నాయి. 1980 నుంచి 2003 వరకు మంగళూరు ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేశాడు. ఆ సమయంలో నిస్సహాయ మహిళలను గుర్తించి వారితో పరిచయం పెంచుకుని అఘాయిత్యాలకు పాల్పడుతూ వచ్చాడు.  కేరళ, మంగళూరు తదితర ప్రాంతాల్లో సైనైడ్‌ను ఉపయోగించి తన హత్యా పరంపరపను కొనసాగించాడు. పలువురు మహిళల హత్య కేసుల్లో ఇతనికి 2013లో కూడా మంగళూరు కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం, బెదిరించడం వంటి కేసుల్లోనూ మోహన్‌ నిందితుడు. 2007లో బెంగళూరులో ఒక సంగీత ఉపాధ్యాయన్ని నమ్మించి ఇలాగే హత్య చేశాడు. 

మరిన్ని వార్తలు