‘రికార్డుల’ గిత్త ఆకస్మిక మృతి

25 Oct, 2019 07:28 IST|Sakshi

123 పందేల్లో గెలిచిన ఒంగోలు జాతి గిత్త

గన్నవరం : జాతీయ, రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పోటీల్లో వందకుపైగా బహుమతులు, రికార్డులతో సత్తాచాటిన రూ.15 లక్షలు ఖరీదైన గిత్త (9) ఆకస్మికంగా మృతి చెందింది. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో బుధవారం అర్థరాత్రి జరిగింది. ఎంతో ప్రేమగా సాకుతున్న గిత్త మృతి చెందడంతో తల్లడిల్లిపోయిన నిర్వాహకులు గిత్తకి ఘనంగా అంతిమయాత్ర నిర్వహించి కన్నీటీ వీడ్కోలు పలికారు. పాతగన్నవరంలోని శ్రీ లక్ష్మీనరసింహ నంది బ్రీడింగ్‌ అండ్‌ బుల్స్‌ సెంటర్‌ నిర్వాహకుడైన కాసన్నేని రాజా 2017 నవంబర్‌లో వైఎస్సార్‌ జిల్లా పోతిరెడ్డిపల్లికి చెందిన ఈ ఒంగోలు జాతి గిత్తను రూ.15 లక్షలకు కొనుగోలు చేశారు.

అప్పటి నుంచి మరో రెండు మూడు గిత్తలతో కలిసి ఈ వృషభరాజం ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటకలో జరిగిన 123కు పైగా జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంది. వీటిలో వందకుపైగా మొదటి స్థానంలో నిలిచింది. మిగిలిన వాటిలో ద్వితీయ, తృతీయ బహుమతులను సాధించింది. పోతిరెడ్డిపల్లి అనే పేరుతో పిలుచుకునే ఈ గిత్త బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. జాతీయ స్థాయిలో కృష్ణా జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన ఈ వృషభరాజానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పూలతో అలంకరించిన ట్రాక్టర్‌పై గిత్తకు ఘనంగా అంతిమయాత్ర నిర్వహించి గ్రామం వెలుపల మట్టి చేశారు.  
 

మరిన్ని వార్తలు