మాయలోళ్లు..

28 Dec, 2019 13:16 IST|Sakshi

కావలి కేంద్రంగా పుట్టుకొచ్చిన ఐదు గ్యాంగ్‌లు

రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన ముఠాలు

వీరి మోసాలు కోకొల్లలు

బురిడీగాళ్లకు వేగుల్లా పనిచేస్తున్న కొందరు పోలీసులు

‘ఘరానా మోసాల గ్యాంగ్‌’ పై ఎస్పీ దృష్టి

వీరు మాటల మాంత్రికులు. ఎంతటి వ్యక్తులైనా ఇట్టే వారి బుట్టలో పడిపోవడం ఖాయం. అంతటి మాయల మరాఠీలు. అమాయకులపై ఆశల వల విసిరి.. రూ.లక్షలు నొక్కేసి, చివరికి విలవిలలాడేలా చేస్తారు. ఈ బురిడీగాళ్ల ఉచ్చులో పడి ఎంతో మంది వీధుల పాలవున్నారు. కావలి కేంద్రంగా పుట్టుకొచ్చిన ఈ గ్యాంగ్‌లు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. వీరి మోసాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. ఈ ఘరానా మోసగాళ్ల గ్యాంగ్‌ లీడర్లు కావలిలోనే ఉంటారు. కొందరు పోలీసులు వీరికి వేగుల్లా పనిచేస్తున్నట్లు జిల్లా పోలీస్‌ బాస్‌ దృష్టికి వెళ్లింది. ఈ గ్యాంగ్‌ల కార్యకలాపాలపై ఆయన దృష్టి సారించారు. ఓ గ్యాంగ్‌ లీడర్‌ను అరెస్ట్‌ చేయడంతో, మిగతా గ్యాంగ్‌లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాయి.  

నెల్లూరు, కావలి: విలాసవంతమైన ఇళ్లు. ఇళ్లకు సీసీ కెమెరాలు. ఖరీదైన కార్లు. అడుగు తీసి అడుగు వేస్తే లగ్జరీ జీవనశైలి. ఇదంతా కావలిలోని ‘ఘరానా మోసాల గ్యాంగ్‌’ జీవన విధానం. నయా పైసా కూడా పెట్టుబడి పెట్టి ఎలాంటి వ్యాపారాలు చేయరు. బంగారం, నగదు సులభంగా సంపాదించవచ్చనే ఆశల వలే వీరి పెట్టుబడి. అత్యాశ, బలహీనతలు, అమాయకులే వీరి టార్గెట్‌. మాయ మాటలతో బురిడీ కొట్టించి వారి నుంచి రూ.లక్షల్లో నగదు కొట్టేయడం వీరికి మంచినీళ్లు తాగినంత సులువైన పని. ఈ పనినే ‘వృత్తి’గా చేసుకొని జల్సాగా బతికేస్తున్నారు. మోసపోయిన బాధితులు కన్నీరు మున్నీరవుతూ వారిని ప్రశ్నిస్తే చావు అంచు వరకు తీసుకెళ్లేలా భయపెడుతారు. కావలి కేంద్రంగా ఈ తరహా నేరాలకు పాల్పడే ఐదు గ్యాంగ్‌లు ఉన్నాయి. ఈ ముఠాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉండటం గమనార్హం. ఈ గ్యాంగ్‌కు పోలీసుల్లోనే

సన్నిహితులు ఉన్నారు. బాధితులు ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేసినా క్షణాల్లో వీరికి తెలిసి పోతుంది. అందుకే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ గ్యాంగ్‌ల కార్యకలాపాలు, పోలీసుల వైఖరి ఇటీవల కొత్తగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన భాస్కర్‌భూషణ్‌ దృష్టికి వెళ్లాయి. దీంతో ఎస్పీ స్వయంగా ఈ గ్యాంగ్‌ కార్యకలాపాలపై దృష్టి సారించి, ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నారు.  

మోసాలు ఇలా..
ఇతర దేశాల నుంచి బంగారం పెద్ద ఎత్తున వస్తుందని, బిల్లులు, పన్నులు లేని బంగారం కావడంతో మార్కెట్‌ ధరకన్నా 40 శాతం తక్కువకే వస్తుందని, అయితే కేజీల్లోనే కొనుగోలు చేయాలని ఈ ఘరానా మోసాల గ్యాంగ్‌ వల విసురుతోంది. వీరి మాయల వలలో పడి బంగారం కోసం డబ్బు తెచ్చే వారిని, ఎక్కువ డబ్బు తీసుకోవచ్చని మాటల్లో పెట్టి మాయ చేస్తున్నారు. కొద్ది రోజుల్లో రూ.2,000 నోట్లను ప్రభుత్వం రద్దు చేస్తుందని, తమకు తెలిసిన వారి వద్ద రూ.2 వేల నోట్లు బ్లాక్‌ మనీ ఉందని చెబుతున్నారు. వైట్‌ మనీగా మీరు డబ్బులిస్తే అంతకు రెట్టింపు మొత్తం ఇస్తామని నమ్మబలుకుతున్నారు. ఇలా తక్కువ ధరకే బంగారం, నోట్లు మార్పిడి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తమకున్న నెట్‌వర్క్‌ ద్వారా డబ్బున్న వాళ్లపై ఆశల వలలను విసురుతారు. ఈ లావాదేవీలు జరుగుతున్న సమయంలోనే గ్యాంగ్‌లోని సభ్యులే పోలీసుల అవతారంలో వచ్చి డబ్బు తీసుకొన్న వ్యక్తిని తమ వెంట తీసుకెళ్లిపోతాడు. లేకపోతే ఇప్పుడే మాట్లాడి సెటిల్‌ చేసుకుని వస్తామంటూ డబ్బు ఇచ్చిన వారి వద్ద నుంచి పరారైపోతారు. కావలిలోని వారి ఇళ్లకే పిలిపించుకొని డబ్బు తీసుకొని, ఇంట్లోనే వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఘటనలు చాలా ఉన్నాయి. అసలు వీరి వద్ద గ్రామ బంగారం ఉండదు, రూ.2,000 నోట్లు అసలే ఉండవు. ఇవేవీ లేకుండానే భారీగా ఉన్నట్లుగా నమ్మించి, నమ్మకంగా వచ్చిన వారి వద్ద రూ.లక్షల్లో దోచుకోవడం వీరికి బాగా తెలిసిన విద్య.

ఘరానా గ్యాంగ్‌ లీడర్లు కావలి వాసులే..
రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన ఘరానా గ్యాంగ్‌ లీడర్లు కావలి వాసులు. కావలి కేంద్రంగా ఐదు ముఠాలు పుట్టుకొచ్చాయి. కావలికి చెందిన ఓ వ్యక్తి 2003లో ఈ తరహా మోసాలను ప్రారంభించాడు. ఆయన బంధువులైన మరో ఇద్దరు కూడా రెండు గ్యాంగ్‌లను ఏర్పరచుకొన్నారు. వీరిని చూసి మరో ముగ్గురు తమ గ్యాంగ్‌లను తయారు చేసుకొన్నారు. ఇది ఇలా ఉండగా 2015లో ఘరానా మోసాల గ్యాంగ్‌ సృష్టికర్త స్వీయపరివర్తన చెంది, ఈ మోసాలకు దూరమైపోయాడు. ఇక మిగిలిన ఐదుగురు మాత్రం తమ ముఠాలను, కార్యకలాపాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. ఘరానా మోసాలను వృత్తిగా మార్చుకుని జీవన విధానం కొనసాగిస్తున్నారు. ఈ గ్యాంగ్‌లు రాష్ట్ర వ్యాప్తంగా మోసాలు చేస్తూ రూ.కోట్లలో ఆర్జించారు.

పోలీసులనే లొంగదీసుకోవడంలో సిద్ధహస్తులు
పోలీసులనే తమకు అనుకూలంగా లొంగదీసుకోవడంలో ఈ గ్యాంగ్‌లు సిద్ధహస్తులు. నిజాయతీ కలిగిన పోలీసులు ఈ గ్యాంగ్‌ల కార్యకలాపాలపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తే, పోలీసు శాఖలోని అవినీతి తిమింగళాల సహకారంతో క్షేమంగా తప్పించుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. నిజాయతీ పరులైన పోలీసు అధికారులపైనే ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తూ భయపెట్టి తమకు లొంగిపోయేలా చేస్తారని సాక్షాత్తూ పోలీసు అధికారులే అంటున్నారు. ఘరానా మోసాల గ్యాంగ్‌ బాధితులు కొత్తగా ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన భాస్కర్‌ భూషణ్‌ దృష్టికి తీసుకెళ్లడంలో వీరి దందాలు తాజాగా బయటకు వచ్చాయి. ఇప్పటికే రెండు గ్యాంగ్‌లు రూ.35 లక్షలు మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ ఈ గ్యాంగ్‌లపై దృష్టి సారించడంతో ఇందులోని ఓ గ్యాంగ్‌లీడర్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో మిగిలిన నలుగురు గ్యాంగ్‌ లీడర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అక్కడి నుంచే పోలీస్‌ చర్యలను కట్టడి చేసేందుకు సామ, దాన, దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. ఈ గ్యాంగ్‌లపై జరుగుతున్న రహస్య విచారణను ఎస్పీ ప్రతి రోజూ పోలీసులు అధికారులతో సమీక్షిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే వీరి ఆటకట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మరిన్ని వార్తలు