యూపీలో ఆగని నేరాలు

15 Oct, 2017 19:10 IST|Sakshi

యూపీలో అత్యాచార బాధితురాలి ఆత్మహత్య

మరోచోట దళిత యువతిపై లైంగిక దాడి

ముజఫర్‌నగర్‌/భాగపట్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళల మీద లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. అత్యాచార అవమానాన్ని తట్టుకోలేని యువతులు ఆ‍త్మహత్యలు చేసుకుంటున్నారు. మరోచోట.. ఒంటరిగా మహిళ కనిపిస్తే మృగాళ్లు దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని భాగపట్‌లోని 15 ఏళ్ల యువతి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఈ యువతిపై నాలుగు నెలల కిందట ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. వారిమీద పోలీస్‌ కేసు పెట్టగా.. నిందితులను అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అయిన నిం‍దితులు సోను, మను, రోహిత్‌, సాగర్‌, పప్పులు తరువాత తప్పించుకుని పారిపోయారు. అప్పటి నుంచి కేస్‌ను వెనక్కి తీసుకోవాలని బాధితురాలిపే ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టారు. కేసు ఉపసంహరించుకోకపోతే మళ్లీ అత్యాచారం చేస్తామని బెదిరించారు. దీంతో అవమాన భారంతో ఈ యువతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.

ఇక, ముజఫర్‌నగర్‌కు సమీపంలోని పచేంద అనే గ్రామంలో నివసించే ఒక దళిత బాలికపై జాట్‌ తెగకు చెందిన నలుగురు యువకులు ఆదివారం ఉదయం లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం గ్రామంలోని దళిత మైనర్‌ బాలిక ఆదివారం ఉదయం ఇంటికి వస్తోంది. అదే సమయంలో అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఆమెపట్ల తొలుత అసభ్యంగా మాట్లాడి అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డారు. దళిత యువతిపై లైంగిక దాడి జరగడంతో గ్రామంలో దళితులు, జాట్‌ల ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు