విధి పరీక్షకు ఫలితం బలవన్మరణం

6 Dec, 2017 09:06 IST|Sakshi

పరీక్షలు సక్రమంగా రాయలేదని

మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

కన్నవారికి కడుపుకోత  

విషాదంలో చోడవరం లక్ష్మీనగర్‌ వాసులు

చోడవరం: భర్తచనిపోయినా తన రెక్కల కష్టం పై..పిల్లలు కష్టమెరగకుండా పెంచిన తల్లి ఆశలు అడియాసలయ్యాయి...అన్నదమ్ములు పెంచుకున్న అభిమానం ఆవిరైంది... విధి పెట్టిన పరీక్షలో ఆ కుటుం బం తమ గారాల పట్టిని కోల్పోయింది.  ఎంతో చలా కీగా ఉంటూ,  సరదాగా తిరిగే   ఆ యువతి అనుకున్న లక్ష్యం మేరకు పరీక్షలు సరిగా రాయలేకపోయానన్న కారణంతో ఆత్మహత్య చేసుకుని, కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచేసింది. చెల్లెలు  బలవన్మరణం చెందడంతో  అన్నయ్యలిద్దరి గుండెలుపగిలేలా రోదించారు. వివరాలు ఇలా ఉన్నాయి.  చోడవరం లక్ష్మీనగర్‌లో నివాసముంటున్న రుప్ప లక్ష్మీనర్సమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పిల్లలు చిన్నప్పుడే భర్త చనిపోవడంతో అన్నీ తానై  నలుగురు పిల్లల్నీ పెంచింది.

ఓ కుమార్తెకు వివాహం చేసింది. వివాహం జరిగిన కుమార్తె  కూడా చోడవరంలోనే ఇదే వీధిలో నివాసం ఉంటోంది.  చిన్నకూతురు హరిత (18) చోడవరంలో ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.  కుమారుల్లో ఒకరు ఉద్యోగం, మరొకరు మోటారు ఫీల్డులో పనిచేస్తున్నారు.  హరిత ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తోంది. ఒకటి తప్పా మిగతా పరీక్షలన్నీ ఇప్పటికే పూర్తయిపోయాయి. అయితే అనుకున్న లక్ష్యం మేర పరీక్షలు రాయలేకపోయానని మనస్తాపానికి గురైన హరిత, పక్కనే ఉన్న తన అక్క ఇంటికి సోమవా రం  వెళ్లింది. పరీక్షల గురించి అక్క లీలావాణితో చెప్పి బాధపడింది. పర్వాలేదులే మంచి మార్కుల కోసం మళ్లీ రాద్దువుగాని అని సర్ది చెప్పి,  తన పరీక్షల నిమిత్తం ఆమె శ్రీకాకుళం వెళ్లింది. అయినా  బాధ నుంచి బయటపడని  హరిత,  అక్క ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడాన్ని చూసి సోమవారం రాత్రి   గదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

అక్క ఇంటికి వెళ్లిన కూతురు రాత్రయినా రాకపోయే సరికి చూసిరమ్మని  తన పెద్ద మనుమరాలిని  హరిత తల్లి పంపింది.  ఇంటికి వెళ్లిచూడగా అప్పటికే  గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న హరితను చూసి భయపడి మావయ్యలకు తెలిపింది. వారు వచ్చి  వేలాడుతున్న చెల్లెలను కిందకు దించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం అందడంతో చోడవరం ఎస్‌ఐ మల్లేశ్వరరావు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.  కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అందరితో ఎంతో సరదాగా ఉండే హరిత మృతిచెందిందని తెలియడంతో తోటి విద్యార్థులు, స్థానికులు ఇక్కడుకు వచ్చారు. వారంతా శోకసంద్రంలో మునిగారు.

మరిన్ని వార్తలు