దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌

6 Dec, 2019 07:21 IST|Sakshi

సాక్షి, షాద్‌నగర్‌ : ‘దిశ’ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. కాగా గత నెల 27న వెటర్నరీ వైద్యురాలిపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద కాల్చివేశారు. దిశ కేసులో నిందితులను నిన్న (గురువారం) పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

విచారణలో భాగంగా .... దుర్ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు నిందితులను తీసుకు వెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా... వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు దాడికి యత్నించారు. దీంతో వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ప్రధాన నిందితుడుఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను  పోలీసులు గోప్యంగా ఉంచారు.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ఘటనలో విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు అనుమతితో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేస్తూ 3వ తేదీతో న్యాయ శాఖ ఉత్తర్వులు (జీవో ఆర్‌టీ నంబర్‌ 639) జారీ చేసింది. 

మరిన్ని వార్తలు