వాగ్బాణాలు

10 Feb, 2018 08:03 IST|Sakshi
రజనీకాంత్‌ - కమల్‌హాసన్‌

రజనీకాంత్‌ ఆధ్యాత్మిక పార్టీపై కమల్‌ అభిమానుల ఎద్దేవా

ప్రజలంతా తమవైపేనని రజనీ అభిమానుల ధీమా

అభిమానులతో సమావేశమైన రజనీకాంత్‌

‘ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్న చందంగా నటులు రజనీకాంత్, కమల్‌హాసన్‌ అభిమానులు వ్యవహరిస్తున్నారు. కమల్, రజనీ పార్టీ పెట్టలేదు, ప్రజల్లోకి వెళ్లలేదు, ఎన్నికలు ఎదుర్కోలేదు...ఇంతలోనే తమిళనాడులో తమదే ఆధిక్యమని వాదులాడుకోవడం, ఎద్దేవాలు చేసుకోవడాన్ని ప్రారంభించేశారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై:   నటులు కమల్‌హాసన్, రజనీకాంత్‌ ఇరువురూ రాజకీయపార్టీ ఏర్పాటులో బిజీబిజీగా గడుపుతున్నారు. రజనీకాంత్‌ అభిమానుల సంఘాన్ని రజనీకాంత్‌ ప్రజా సంఘంగా మార్చివేసి అభిమాన సంఘాల నేతల ద్వారా సభ్యత్వ నమోదు సాగిస్తున్నారు. రెండుకోట్ల సభ్యత్వం లక్ష్యంగా పెట్టుకుని వ్యక్తిగతంగానూ ఆన్‌లైన్‌ ద్వారాను నమోదు చేస్తున్నారు. సభ్యత్వాల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా రజనీకాంత్‌ ఆదేశించారు. వేలూరు, తిరునెల్వేలి, తూత్తుకూడి జిల్లాల్లో నిర్వాహకుల నియామకాన్ని పూర్తి చేశారు. పార్టీ పేరు, పతాకం, చిహ్నంల ఎంపికపై పరిశీలన జరుగుతోంది. 2021లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 స్థానాల్లో పోటీచేయాలని రజనీకాంత్‌ ఇప్పటికే నిర్ధారించుకున్నారు. దీంతో ఆయన అభిమానులు నియోజకవర్గాల వారీగా సన్నాహాలు సాగిస్తున్నారు.

త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటానని రజనీ చెప్పడంతో అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇదిలా ఉండగా, రాజకీయాల్లో రజనీ, కమల్‌ కలిసి పనిచేస్తారా అనే అంశంపై రాష్ట్రంలో రసవత్తరమైన చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని రజనీ అభిమానులను శుక్రవారం మీడియా ప్రశ్నించగా, రజనీకాంత్‌ ఎంతో తెలివైనవారు, తనకు జీవితాన్ని ఇచ్చిన తమిళులకు మంచి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. రజనీకాంత్‌కు కమల్‌ కంటే ఎక్కువగా ప్రజల్లో పలుకుబడి, ఆదరణ ఉంది. సభ్యత్వ నమోదు సమయంలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. రజనీతో కలిసి పనిచేయడాన్ని కాలమే నిర్ణయిస్తుందని కమల్‌ అంటున్నారు. అయితే కమల్‌ను నమ్ముకుని రజనీకాంత్‌ లేరు. రజనీకాంత్‌కు ఉన్న పేరు ప్రఖ్యాతులే విజయాన్ని చేకూరుస్తాయి. రజనీకాంత్‌ తన సొంత పలుకుబడిని నమ్ముకునే రాజకీయాల్లోకి దిగుతున్నారు. రజనీ స్థాపించబోయే ఆధ్యాత్మిక పార్టీ అందరి అభిమానాన్ని చూరగొంటుంది. దేవుడు లేడనే భావన కలిగిన వారు కమల్‌హాసన్‌. రజనీకాంత్‌ అందరినీ కలుపుకుపోగల మనస్తత్వం కలిగినవారు. రజనీకాంత్‌ పెట్టబోయే పార్టీనే రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని అభిమానులు ధీమా వెలి బుచ్చారు.

రజనీ ఆధ్యాత్మిక పార్టీ చెల్లుబాటు కాదు:
ఇదిలా ఉండగా, రజనీకాంత్‌ పెట్టబోయే ఆధ్యాత్మిక రాజకీయ పార్టీ ప్రజల్లో చెల్లుబాటు కాదని కమల్‌హాసన్‌ అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు. రాజకీయాల్లో కలిసి పనిచేయడంపై రజనీ ఇచ్చిన సమాధానమే కమల్‌ కూడా ఇచ్చారు. దీనిపై కమల్‌ అభిమానులు శుక్రవారం మీడియా వద్ద ఘాటుగా స్పందించారు. ఈనెల 21వ తేదీన కమల్‌ పార్టీ పెట్టడం ఖాయమైంది. రాష్ట్రపర్యటనకు సిద్ధమవుతున్నారు. బస్‌చార్జీల పెంపు తదితర ప్రజా సమస్యలపై వెంటనే స్పందించడం ద్వారా రాజకీయాలపై తన చిత్తశుద్ధిని కమల్‌ చాటుతున్నారు. రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందించాలని భావిస్తున్నారు. అయితే రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన రజనీకాంత్‌ ఆ తరువాత నుంచి నోరుమెదపడం లేదు. ప్రజా సమస్యలపై కనీస మాత్రంగా కూడా స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు.

అదే కమల్‌ అయితే ప్రతివిషయాన్ని అభిమానులతో చర్చించి తన అభిప్రాయాలను చెబుతున్నారు. పార్టీ, రాష్ట్రవ్యాప్త పర్యటనపై రజనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. వీడియోల ద్వారా మాత్రమే అభిమానులను రజనీ తన అభిమానులను కలుస్తుండగా, కమల్‌ మమ్మల్ని నేరుగా కలుస్తున్నారు. ఎలాంటి బందోబస్తు లేకుండా ప్రజల్లోకి వెళుతున్నారు. తమిళనాడులో జన్మించిన కమల్‌కు ఇక్కడి ప్రజల అవసరాలు ఏమిటో బాగా తెలుసు. రజనీ కంటే కమల్‌కే ప్రజాబలం ఎక్కువగా ఉందన్న సత్యం త్వరలోనే నిరూపణ అవుతుంది.  రజనీకాంత్‌ పెట్టబోయే ఆధ్యాత్మిక పార్టీ ప్రస్తుత రాజకీయాల్లో ఎంతమాత్రం పనికిరాదు. సభ్యత్వ నమోదు వేగంగా జరుగుతోంది. రజనీకాంత్‌తో కలిసి పనిచేయడంపై కాలమే నిర్ణయిస్తుందని మాత్రమే కమల్‌ చెప్పారు, కలిసి పనిచేస్తామని చెప్పలేదు. ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్న కమల్‌ వల్ల రాష్ట్రంలో సుపరిపాలన తథ్యమని వారు అన్నారు.

సన్నద్ధంగా ఉండండి:  అభిమానులకు రజనీ పిలుపు
అభిమానుల పోటాపోటీ పరుష వ్యాఖ్యలు ఇలా సాగుతుండగానే, రజనీకాంత్‌ తన అభిమాన సంఘాల నేతలతో శుక్రవారం సమావేశమయ్యారు. చెన్నై కోడంబాక్కంలోని తన రాఘవేంద్ర కల్యాణ మండపానికి ఉదయం 11 గంటలకు వచ్చిన రజనీ కొందరు నేతలను పిలిపించుకుని సభ్యత్వ నమోదు వివరాలను తెలుసుకున్నారు. సభ్యత్వ నమోదులో ఎంతమాత్రం జాప్యం తగదని, రేయింబవళ్లు శ్రమించి రెండుకోట్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని రజనీ సూచించినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని చేర్చుకోవాలా వద్దా అనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపార్టీతోనూ పొత్తు లేదు, స్వతంత్రంగానే పోటీచేస్తున్నామని, ఇందుకు అభిమానులు సిద్ధంగా ఉండాలని రజనీ పునరుద్ఘాటించినట్లు సమాచారం. త్వరలో కేంద్రం లోనూ, రాష్ట్రంలోనూ ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యంలేదు, ఎన్నికలు ఎపుడు వచ్చినా ఢీకొనేందుకు అభిమానులు సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ స్థాపనలో తరువాతి దశపై చర్చించారు. కోయంబత్తూరు నిర్వాహకుల ఎంపికపై శని, ఆదివారాల్లో రజనీ సమావేశం అవుతున్నారు.  

మరిన్ని వార్తలు