ఎన్‌కౌంటర్‌లో రౌడీ హతం | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో రౌడీ హతం

Published Thu, Nov 23 2023 12:50 AM

 కొంబన్‌ జగన్‌  - Sakshi

●తిరుచ్చిలో ఘటన

సాక్షి, చైన్నె : తిరుచ్చిలో బుధవారం సాయంత్రం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో రౌడీ కొంబన్‌ జగన్‌ హతమయ్యాడు. వివరాలు.. తిరుచ్చి నగరం పరిధిలో తిరువెరంబూరు పయనకురిచ్చికి చెందిన కొంబన్‌ జగన్‌ పోలీసుల వాంటెడ్‌ లిస్టులో ఉన్న పేరు మోసిన రౌడీ. ఇతగాడిపై హత్యలు, దోపిడీలు తదితర 11కు పైగా కేసులు ఉన్నాయి. ఇతగాడు అజ్ఞాతంలో ఉంటూ తన మద్దతుదారుల ద్వారా హత్యలు, దోపిడీలు చేయిస్తూ వచ్చాడు. ఇటీవల పోలీసులు జరిపిన ఓ ఆపరేషన్‌లో అతడి మద్దతు దారులు, అనుచరులు పలువురు చిక్కారు. వీరు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కొంబన్‌ జగన్‌ కదలికలపై దృష్టి పెట్టారు. ఎస్పీ వరుణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం వేట మొదలెట్టింది. ఈ పరిస్థితుల్లో మనప్పారై పోలీసులకు అందిన సమాచారంతో కొంబన్‌ జగన్‌ కోసం ఇద్దరు సబ్‌ ఇన్‌స్పెక్టర్లతో కూడిన బృందం పరుగులు తీసింది. తిరుచ్చి – చైన్నె జాతీయ రహదారిలోని సిరువనూరు వద్ద తలదాచుకుని ఉన్న కొంబన్‌ జగన్‌ను పోలీసులు చుట్టుముట్టారు. ఈ సమయంలో ఎస్‌ఐ వినోద్‌పై అతడు దాడి చేశాడు. ఈ దాడిలో వినోద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆత్మరక్షణ కోసం మరో ఎస్‌ఐ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గాయపడ్డ జగన్‌ను ఆగమేఘాలపై లాల్గుడి ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మరణించాడు. ఎన్‌కౌంటర్‌లో కొంబన్‌ జగన్‌ హతం సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌ఐ వినోద్‌ను పరామర్శించారు. జగన్‌ మృతదేహాన్ని లాల్గుడి ఆస్పత్రిమార్చురీకి తరలించారు. తహసీల్దార్‌ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement