ఎట్టకేలకు నాని దొరికిపోయాడు!

28 Jun, 2018 14:12 IST|Sakshi
మహేష్‌

సబ్‌జైల్‌ నుంచి పరారైన ఛీటర్‌ మహేష్‌

ఐదేళ్లకు పట్టుకున్న పోలీసులు

ఆదోని టౌన్‌: ఆదోని సబ్‌జైల్‌ నుంచి తప్పించుకున్న మహేష్‌ అలియాస్‌ నాని అనే ఖైదీని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మంగళవారం రాత్రి గుంటూరు–మంగళగిరి మధ్యలో అరెస్ట్‌ చేసి, ఆదోనికి తీసుకొచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఎమ్మిగనూరుకు చెందిన ఇతను ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని, చీటీల పేరిట పలువురిని మోసం చేశాడు. ఈ కేసుల్లో శిక్ష పడడంతో 2013 జూన్‌ 21న ఆదోని సబ్‌జైలుకు వచ్చాడు. జైలులోనే ఉంటూ తప్పించుకునేందుకు అనుచరగణం, పోలీస్, న్యాయవ్యవస్థలోని కొంతమందితో కలిసి పథకాన్ని రచించాడు.

ఈ పథకం అమల్లో భాగంగా కొందరు వ్యక్తులు 2013 జూలై 17న తాము పోలీసులమని, మహేష్‌ను తీసుకెళ్లడానికి పీటీ వారెంట్‌తో వచ్చామని ఆదోని సబ్‌జైలు సిబ్బందిని నమ్మించారు. అది నకిలీ పీటీ వారెంట్‌ అని గుర్తించేలోపే అతన్ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చి..వెంటనే ప్రత్యేక వాహనంలో సరిహద్దు దాటించారు. దీంతో ఈ విషయంపై జైలు సూపరింటెండెంట్‌ రత్నం ఆదోని టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేష్, మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహేష్‌ కోసం అప్పట్లో ప్రత్యేక బృందాలతో గాలించినా ఫలితంలేకపోయింది. మిగిలిన వారిని మాత్రం అరెస్టు చేశారు.

ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుని..
జైలు నుంచి పరారైన తర్వాత మహేష్‌ తనను ఎవరూ గుర్తు పట్టకుండా మొహానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓ మత గురువుగా మారి జనానికి చేరువైనట్లు సమాచారం. అయితే..ఇతను మారువేషంలో మంగళగిరి ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు ఉప్పందింది. దీంతో డీఎస్పీ క్రైంపార్టీ ఏఎస్‌ఐ ఆనంద్, పోలీసులు శాంతరాజ్, క్రిష్ణ, రంగన్న మంగళవారం రాత్రి అక్కడికి వెళ్లి అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం అతన్ని ఆదోనికి తరలించి విచారణ చేస్తున్నట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు