జయ మరణం; ‘అమ్మ’ డ్రైవర్‌ కీలక సమాచారం | Sakshi
Sakshi News home page

జయ మరణం; ‘అమ్మ’ డ్రైవర్‌ కీలక సమాచారం

Published Thu, Jun 28 2018 2:15 PM

Arumuga Commission Revealed Jayalalitha Driver Statement - Sakshi

చెన్నై : దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి  జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న ఆర్ముగస్వామి కమిషన్‌ ఆసక్తికర అంశాలను బయటపెట్టింది. దర్యాప్తులో భాగంగా కమిషన్‌ జయలలిత నెచ్చలి శశికళ, ఆమె వ్యక్తిగత వైద్యుడు శివకుమార్‌తో పాటు జయలలిత దగ్గర చాలాకాలంగా డ్రైవర్‌గా పనిచేస్తున్న కన్నన్‌ని వేర్వేరుగా విచారించింది. శశికళ, వైద్యుడు, కన్నన్‌ చెప్పిన అంశాలకు పొంతన లేదని తెలిపింది.

శశికళ, శివకుమార్‌ల వర్షన్‌...
‘ఆ రోజు అనగా 2016, సెప్టెంబర్‌ 22న అమ్మ(జయలలిత) బెడ్‌పై కూర్చుని ఉంది. అకస్మాత్తుగా పడిపోయింది. దాంతో  డ్రైవర్‌ కన్నన్‌, జయ వ్యక్తిగత భద్రతా అధికారి ‘అమ్మ’ను బెడ్‌ మీద నుంచి వీల్‌ చైర్‌లోకి మార్చడానికి ప్రయత్నించారు. కానీ వారికి అది సాధ్యపడలేదు. దాంతో రాత్రి 9.30 గంటలకు అంబులెన్స్‌కు ఫోన్‌ చేసామని’ చెప్పారు.

కన్నన్‌ చెప్పిన వివరాలు...
‘అమ్మ’ డ్రైవర్‌ కన్నన్‌ మాత్రం శశికళ, శివకుమార్‌లు చెప్పిన దానికి విరుద్ధమైన విషయాలు చెప్పాడని కమిషన్‌ వెల్లడించింది. కన్నన్‌ 1991 నుంచి జయలలిత దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కన్నన్‌ జయలలితను ఆస్పత్రిలో చేర్చిన రోజు జరిగిన సంఘటన గురించి కమిషన్‌తో  చెప్పిన వివరాలు... ‘నేను ‘అమ్మ’ గదిలోకి వెళ్లేసరికి ఆమె చైర్‌లో కూర్చుని ఉన్నారు. అప్పటికే ‘అమ్మ’ స్పృహ కోల్పోయి ఉన్నారు. ఆ సమయంలో అక్కడ కొన్ని ఫైల్స్‌ ఓపెన్‌ చేసి ఉన్నాయి. పెన్ను కాప్‌ కూడా తీసి ఉంది. ‘చిన్నమ్మ’ నాతో వెంటనే వెళ్లి ఒక వీల్‌ చైర్‌ తీసుకు రా, అమ్మని ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పింది. కొంతసేపటి తరువాత నేను, పీఎస్‌ఓ వీరపెరుమాల్‌ చైర్‌ తీసుకువచ్చి, అమ్మను ఆ చైర్‌లో కూర్చొపెట్టాము. రెండడుగులు వేసామో, లేదో అమ్మ చైర్‌ నుంచి కింద పడింది. వెంటనే నేను, వీరపెరుమాల్‌ ‘అమ్మ’ను లేపడానికి ప్రయత్నించాము. కానీ మా వల్ల కాలేదు. దాంతో స్ట్రెచర్‌ తీసుకువస్తే బాగుంటుందని భావించామ’ని తెలిపాడు.

గంట సేపు డాక్టర్‌ అదృశ్యం...
అంతేకాక కన్నన్‌ చెప్పిన మరో ఆసక్తికర అంశమేంటంటే.. ‘నేను రాత్రి 8.30 గంటల సమయంలో డాక్టర్‌ శివకుమార్‌ను పోయెస్‌ గార్డెన్‌లో చూశాను. కానీ కొంతసేపటి తరువాత ఆయన బయటకు వెళ్లిపోయాడు. మళ్లీ ఆయన తిరిగి ఎప్పుడు పోయెస్‌ గార్డెన్‌కి వచ్చాడో నాకు తెలియదు. కానీ నేను అమ్మ గదిలోకి వెళ్లినప్పుడు శివకుమార్‌ అక్కడే ఉన్నాడు. అంటే దాదాపు గంట తర్వాత అంటే 9.30 గంటలకు అతను తిరిగి వచ్చుంటాడని తెలిపాడు.

అంతేకాక ‘ఆ రోజు(సెప్టెంబర్‌ 22) రాత్రి 10 గంటల ప్రాంతంలో కారును సిద్ధంగా ఉంచమని పీఎస్‌వో పెరుమాళ్‌కు చెప్పాను. అయితే లక్ష్మి (జయ ఇంట్లో పనిమనిషి) పెద్ద కారు అయితే బాగుంటుందని తనతో చెప్పింద’ని తెలిపాడు. అయితే కన్నన్‌ చెప్పిన ఈ రెండు విషయాలను శశికళ, శివకుమార్‌లు చెప్పలేదని కమిషన్‌ పేర్కొంది. అంతేకాక పోయెస్‌ గార్డెన్‌లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, అయితే సెప్టెంబర్‌ 22 నాటి దృశ్యాలు అందులో రికార్డయ్యాయో, లేదో తనకు తెలియదని కన్నన్‌ కమిషన్‌తో చెప్పాడు.

Advertisement
Advertisement