చేపలవేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

21 Dec, 2018 10:33 IST|Sakshi
మృతదేహంపై పడి రోదిస్తున్న ఆయన కుమార్తె

శాలిగౌరారం(తుంగతుర్తి) : బతుకుదెరువు కోసం కుల వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఓ మత్స్యకార్మికుడు చేపలవేటకు వెళ్లి మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని ఇటుకులపహాడ్‌ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబీకుల బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇటుకులపహాడ్‌ గ్రామానికి చెందిన నీలం వెంకటేశ్‌(56)  30 సంవత్సరాలుగా కులవృత్తి అయిన చేపలవేటపై ఆధారపడి కుటుంబ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో రోజువారి మాదిరిగానే గురువారం తన సన్నిహితులతో కలిసి గ్రామ సమీపంలో ఉన్న మూసీ ప్రాజెక్టులోకి చేపలవేటకు వెళ్లాడు. దీంతో ప్రాజెక్టులోకి దిగి కొన్ని చేపలను పట్టిన ఆయన అదే రీతిలో చేపలను పట్టుకుంటూ వెనుదిరిగాడు.

ఈ క్రమంలో ఆయన వల విసిరిన ప్రదేశంలో ఇసుకను తవ్విన గొయ్యి ఉండడంతో కాలుజారి గోతిలో పడడంతో అదేగోతిలో ఉన్న చేపలవల కాళ్లకు చుట్టుకుంది. తప్పించుకునే క్రమంలో వలలోనే చిక్కుకున్నాడు. చేపల వల నుంచి బయటపడేందుకు వీలుకాకపోవడంతో నీటమునిగిన వెంకటేశం ఊపిరాడక ప్రాజెక్టునీటిలోనే మృతిచెందాడు. కొంత సమయం తర్వాత అతనితో పాటు చేపలవేటకు వెళ్లిన అతని సన్నిహితులు తమ పనిని ముగించుకొని ఒడ్డుకు చేరుకోగా వెంకటేశం మాత్రం కనిపించలేదు. కానీ ప్రాజెక్టు ఒడ్డున వెంకటేశానికి సంబంధించిన సైకిల్, చెప్పులు ఉండడంతో ప్రాజెక్టులో ఎక్కడో ఓ చోట ఉన్నాడనుకున్న అతని సన్నిహితులు ప్రాజెక్టు ఒడ్డున మరికొంత సేపు వేచిచూశారు.

ఎంత సేపటికి వెం కటేశం రాకపోవడం, ప్రాజెక్టులో ఎక్కడా కని పించకపోవడంతో ఆందోళనకు గురైన  సన్నిహితులు ప్రాజెక్టులో కొంతమేర వెతకసాగారు. ఈ క్రమంలో ఓ లోతట్టు ప్రాంతంలో చేపల వలకు సంబంధించిన దిండు(థర్మకోల్‌) కనిపించడంతో వారు దానిని పైకి లాగడంతో వెంకటేశం మృతదేహం కనిపించింది. దీంతో వారు లబోదిబోమం టూ చెరువు ఒడ్డుకు వచ్చి విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంకటేశం మృతదేహాన్ని చూసేందుకు అధికసంఖ్యలో తరలివచ్చారు.

వెంటనే మరికొంతమంది మత్స్యకారులతో పాటు గ్రామస్తులు కలిసి తెప్పపడవలో వెంకటేశం మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. తండ్రి మృతదేహంపై పడి ఆయన కుమార్తె రోదిస్తున్న తీరు అక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఇదిలా ఉండగా వెంకటేశం భార్య ఇటీవల కొంత అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. భర్త మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న ఆమెను బంధువులు, గ్రామస్తులు రాత్రి ఇటుకులపహాడ్‌కు తీసుకువచ్చారు. ప్రమాద సంఘటనపై బాధిత కుటుంబీకులు శుక్రవారం పోలీసులకు పిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.

ఇటుకులపహాడ్‌లో విషాదఛాయలు
చేపలు పట్టేందుకు వెళ్లి వలలో చిక్కుకొని ప్రాజెక్టులో నీటమునిగి నీలం వెంకటేశం మృతిచెందడంతో ఇటుకులపహాడ్‌ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇటుకులపహాడ్‌లో అత్యధికంగా మత్స్యకారుల కుటుంబాలు ఉండడం, వారంతా చేపలవేటపైనే ఆధారపడి జీవనోపాధి పొందడంతో గ్రామం విషాదంలో మునిగిపోయింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు, మత్స్యకారులు, రాజకీయపార్టీల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని వార్తలు