కొంపముంచిన విదేశీ యువతితో ఫేస్‌బుక్‌ పరిచయం

14 Jan, 2020 07:48 IST|Sakshi
ఫిర్యాదులను పరిశీలిస్తున్న డీఎస్పీ గోలి లక్ష్మయ్య

సాక్షి, గుంటూరు: ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ విదేశీ యువతి తనను దారుణంగా మోసం చేసిందని నరసరావుపేటకు చెందిన సీహెచ్‌ కృష్ణదాసు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు రూరల్‌ ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో అర్జీ అందించారు. ఫేస్‌బుక్‌లో తరచూ  చాటింగ్‌ చేస్తున్న క్రమంలో నెల రోజుల క్రితం  గిఫ్టు పంపుతున్నాను అని యువతి కృష్ణదాసుకు సమాచారం పంపింది. కొన్ని రోజుల తర్వాత రోజు మరో వ్యక్తి ఫోన్‌ చేసి  గిఫ్ట్‌ వచ్చిందని పార్సిల్‌ తీసుకోవాలంటే రూ.30 వేలు కట్టాలని అని చెప్పాడు. దీంతో కృష్ణదాసు ఆన్‌లైన్‌లో ఆ నగదు చెల్లించాడు.

మరుసటి రోజున మరో వ్యక్తి ఫోన్‌ చేసి ట్యాక్స్‌లు చెల్లిస్తేనే మీ పార్సిల్‌ తీసుకోవడం సాధ్యం అని చెప్పాడు. మొత్తం రూ.3 లక్షలు కట్టాలని చెప్పడంతో ఆ నగదు కూడా చెల్లించాడు. ఆ తర్వాత నుంచి వారి ఫోన్‌ స్విచ్చాఫ్‌ అయింది. విచారించి న్యాయం చేయాలని బాధితుడు వాపోయాడు. అలానే కట్టుకున్న భర్త వ్యసనాలకు బానిసగా మారి వేధిస్తున్నాడని నరసరావుపేటకు చెందిన శశికళ అనే మహిళ ఫిర్యాదు చేసింది. తన కాపురం చక్కదిద్దాలని వేడుకుంది. 95 కు పైగా ఫిర్యాదులు అందాయి. 

పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు

నా భర్త ఓ హాస్పటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. మాకు ముగ్గురు ఆడపిల్లలు. రెండేళ్ల క్రితం నాకు పుట్టింటి నుంచి వచ్చిన డబ్బుతో పాటు నేను దాచుకున్న డబ్బు రూ. 37 లక్షలు నా భర్త తీసుకున్నాడు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే తరచూ హింసిస్తున్నాడు. బాధలు భరించలేక రెండు రోజుల క్రితం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు చేశానని మళ్లీ తీవ్రంగా కొట్టాడు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోక పోగా నా భర్తకు వత్తాసు పలుకుతున్నారు. విచారించి న్యాయం చేయాలి.
జి.శ్రీలక్ష్మీ, గంగానమ్మపేట, తెనాలి

మరిన్ని వార్తలు