తుళ్లూరు మాజీ తహసీల్దార్‌ సుధీర్‌ అరెస్టు

16 Jul, 2020 03:57 IST|Sakshi
సుధీర్, గుమ్మడి సురేష్‌

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి గుమ్మడి సురేష్‌ సైతం

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాజధాని అమరావతి గ్రామాల పరిధిలో భూముల రికార్డుల తారుమారు కేసులో గుంటూరు జిల్లా తుళ్లూరు మండల మాజీ తహసీల్దార్‌ అన్నే సుధీర్‌ బాబును, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, విజయవాడలో ఎం అండ్‌ ఎం వస్త్ర దుకాణ యజమాని గుమ్మడి సురేష్‌ను బుధవారం తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి అరెస్టు చేశారు. వీరిద్దరిని మంగళగిరి అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వీవీఎన్‌వీ లక్ష్మి ఎదుట హాజరు పరచగా 14 రోజులు రిమాండ్‌ విధించారు. దీంతో నిందితులను గుంటూరు సబ్‌ జైలుకు తరలించారు.  

అనేక అవకతవకలు, అక్రమాలు.. 
► రాజధాని నిర్మాణం పేరిట 29 గ్రామాల పరిధిలో 33 వేల ఎకరాలను గత టీడీపీ సర్కార్‌ సేకరించిన సంగతి తెలిసిందే.  
► తమ భూములను టీడీపీ పెద్దలు, వారి సన్నిహితులు అక్రమంగా తీసుకున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర పేద వర్గాలు ఫిర్యాదులు చేశాయి.  
► తుళ్లూరు మండలం రాయపూడి పంచాయతీ పరిధిలోని పెదలంకలో సర్వే నంబర్‌ 376/2ఎలో 3.70 ఎకరాలను 1975లో నాటి ప్రభుత్వం అసైన్డ్‌ ల్యాండ్‌ కింద ఎస్సీలకు పంపిణీ చేసింది. 
► లబ్ధిదారుల్లో యలమంచిలి సూరయ్య, ఆయన కుమారులు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో తహసీల్దార్‌గా పనిచేసిన సుధీర్‌ బాబు వీరికి చెందిన అసైన్డ్‌ భూమిని పట్టా భూమిగా మార్పు చేసి ఆన్‌లైన్‌ ద్వారా వెబ్‌ ల్యాండ్‌లోకి ఎక్కించారు. తద్వారా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి గుమ్మడి సురేష్‌ 86 సెంట్ల భూమిని అసైనీల నుంచి కొనుగోలు చేసి వల్లూరి శ్రీనివాసబాబు అనే వ్యక్తికి విక్రయించాడు.  
► సుధీర్‌ బాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో కుమ్మక్కై రెవెన్యూ రికార్డులను ఇష్టానుసారం తారుమారు చేయడం, భూమిని ల్యాండ్‌పూలింగ్‌ కింద సీఆర్‌డీఏకు ఇవ్వడం చేశారని విచారణాధికారుల పరిశీలనలో వెల్లడైంది. గతంలో ఆర్డీవోగా పనిచేసిన వ్యక్తి పరోక్ష సహకారం కూడా ఉందని అంచనాకు వచ్చారు. 
► ఈ మోసాన్ని ఆ తర్వాత తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టిన పూర్ణచంద్రరావు గుర్తించి కలెక్టర్‌కు నివేదించారు.  
► రాజధాని గ్రామాలైన అనంతవరం, నేలపాడు, వెలగపూడి, రాయపూడి, పెదలంక తదితర గ్రామాల్లోని మరో తొమ్మిది సర్వే నంబర్లలోని రికార్డులు కూడా తారుమారయ్యాయని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది.  

మరిన్ని వార్తలు