కామాంధుడి ‘మత్తు’ ‘దిశ’ యాప్‌తో చిత్తు

6 Mar, 2020 04:24 IST|Sakshi
నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి లైంగిక దాడికి యత్నించిన ఆటోడ్రైవర్‌

దిశ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసిన బాధితురాలు

సాక్షి, కైకలూరు: రోజూ ఇంటికొచ్చి చిన్నారిని పాఠశాలకు తీసుకెళ్లే ఆటోడ్రైవర్‌ నమ్మకంగా నటిస్తూ ఆ ఇంటి ఇల్లాలిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. బాధితురాలు సమయస్ఫూర్తితో ‘దిశ’ యాప్‌ను ఆశ్రయించడంతో ఆపద నుంచి సురక్షితంగా బయటపడింది. కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు అందిన 8 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడకు చేరుకుని బాధితురాలిని రక్షించారు. కామాంధుడిని కటకటాల్లోకి గెంటేశారు. బస్సులో ఓ మహిళా అధికారిణిపై వేధింపులకు పాల్పడ్డ ఏయూ ప్రొఫెసర్‌ బసవయ్యను గత నెలలో దిశ యాప్‌ ద్వారా అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. 

కూల్‌డ్రింక్‌లో మత్తు మాత్రలు కలిపి..
పందిరిపల్లిగూడెం గ్రామానికి చెందిన భార్యభర్తలు హాస్టల్‌లో ఔట్‌సోర్సింగ్‌ వర్కర్లుగా పని చేస్తున్నారు. వీరికి ఓ పాప ఉంది. ఇదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ వడ్లమన్నాడ పెద్దిరాజు(21) రోజూ పాపను ఆటోలో స్కూల్‌కి తీసుకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒంటరిగా ఉన్న పాప తల్లి వద్దకు వచ్చి కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి తాగాలని బలవంతపెట్టాడు. 

దిశ యాప్‌ ద్వారా..
ఆటోడ్రైవర్‌ ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె 3.19 నిమిషాలకు దిశ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దిశ కాల్‌ సెంటర్‌ నుంచి సమాచారం అందుకున్న స్థానిక సీఐ వైవీవీఎల్‌.నాయుడు, రూరల్‌ ఎస్‌ఐ పి.రామకృష్ణ అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి సమీపంలోని పెద్దింట్లమ్మ జాతరలో విధులు నిర్వహిస్తున్న మహిళా హోంగార్డ్‌ వరలక్ష్మీ కుమారి, కానిస్టేబుళ్లు కిషోర్, నాగగణేష్‌ ఎనిమిది నిమిషాల వ్యవధిలోనే అక్కడకు చేరుకున్నారు. బాధిత మహిళకు ధైర్యం చెప్పారు. ఇది గమనించి పరారైన నిందితుడిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. మేజిస్ట్రేటు ఎదుట హాజరుపర్చగా ఈనెల 19 వరకు రిమాండ్‌ విధించినట్లు చెప్పారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా