ప్రేమ పేరిట నయవంచన

20 Nov, 2017 07:15 IST|Sakshi
పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేస్తన్న బాధితురాలి బంధువులు

తిరుత్తణి: ప్రేమ పేరిట నయవంచన చేసిన యువకుడిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగింది.  తిరుత్తణి మండలం తెక్కళూరు దళితవాడకు చెందిన యువతి(27) ఎంఏ పట్టభద్రురాలు. తిరుత్తణిలోని ప్రయివేటు కళాశాలలో బీఎడ్‌ చదువుతోంది. ఈమెకు అదే గ్రామానికి చెందిన ధనపాల్‌(28)తో పరిచయం ఏర్పడింది. ధన్‌పాల్‌ అరక్కోణంలో ప్రయివేటు బ్యాంకు ఉద్యోగి. ఒకే తెగకు చెందిన వీరి పరిచయం ప్రేమగా మారింది. ఈ స్థితిలో యువతి గర్భం దాల్చింది. తనను త్వరగా వివాహం చేసుకోవాలని యువతి ప్రియుడిపై ఒత్తిడి తెచ్చింది. వివాహం ముందు గర్భం దాల్చిన విశయం తన ఇంట్లో తెలిస్తే పెళ్లికి అనుమతించరని, అబార్షన్‌ చేయించుకున్న తరువాత వివాహం చేసుకుంటానని ధనపాల్‌ ప్రియురాలిని నమ్మించాడు.

తనకు తెలిసిన నర్సు సాయంతో ఓ ఇంట్లో అబార్షన్‌ చేయించాడు. అనంతరం ప్రియురాలిని వావాహం చేసుకునేందుకు తిరస్కరించాడు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆరు నెలల గర్భం సమయంలో అబార్షన్‌తో తాను అనారోగ్యం పాలైనట్లు, ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై చర్యలు చేపట్టి న్యాయం చేయాలని తిరుత్తణి మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై పోలీసులు చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం బాధితురాలు తిరుత్తణి మహిళా స్టేషన్‌ ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలని ధర్నాకు దిగింది. ఆమెకు మద్దతుగా 25 మంది బంధువులు సైతం ధర్నాకు దిగారు. పోలీసులు వారితో చర్చలు జరిపి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. పరారీలో ఉన్న ధనపాల్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు