గురుకులం నుంచి విద్యార్థిని పరార్‌

10 Jul, 2019 10:19 IST|Sakshi
అశ్వియా సోహాన్‌

ధర్మపురి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఘటన

 అర్ధరాత్రి ఇంటికి చేరిన అశ్వియాసోహాన్‌

పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

సాక్షి, ధర్మపురి: మైనార్టీ గురుకుల పాఠశాల నుంచి అర్ధరాత్రి ఓ విద్యార్థిని పరారైన సంఘటన ధర్మపురిలో జరిగింది. ధర్మపురి మండలం మగ్గిడిలోని మైనార్టీ గురుకుల పాఠశాలను ఇటీవల ధర్మపురి పట్టణంలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్‌ స్తంభంకాడి మోహన్‌ పర్యవేక్షణలో సుమారు 260కి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

సోమవారం అర్ధరాత్రి ధర్మపురికి చెందిన అశ్వియా సోహాన్‌ అనే 7వ తరగతి విద్యార్థిని పాఠశాల వెనుక గేట్‌ నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. రాత్రిపూట కూతురు ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. జరిగిన సంఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు హాసియా, అలీపాషాతో పాటు మాజీ వైస్‌ ఎంపీపీ అయ్యోరి రాజేశ్, ముస్లీం నాయకులు ప్రిన్సిపాల్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు.

అర్ధరాత్రి ఒంటరిగా పాఠశాల నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించకపోవడం ఏంటని సిబ్బంది తీరుపై ప్రిన్సిపాల్‌తో వాగ్వాదానికి దిగారు. ఇటీవల ఇక్కడ చదివే ఇద్దరు విద్యార్థినులు ఇదే విధంగా పాఠశాల నుంచి ఇళ్లకు వెళ్లగా ఆ విషయాన్ని కప్పిపుచ్చారంటూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. జరిగిన సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధ్యులపై జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తామని ప్రిన్సిపాల్‌ చెప్పడంతో శాంతించారు.  

మరిన్ని వార్తలు