గ్రౌండ్‌మన్‌ను చంపేశారు..!

30 Jul, 2019 08:26 IST|Sakshi
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ బి.రాజకుమారి 

సాక్షి, విజయనగరం :  విజయనగరం అయోధ్యామైదానంలో గ్రౌండ్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న జరజాపు పెంటయ్య (67)ను దుండగలు అతికిరాతకంగా హత్యచేశారు. ముఖంపైన, చేతులపైన తీవ్రగాయాలు ఉన్నాయి. అందరితో సౌమ్యుడిగా పేరున్న వృద్ధుడిని చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని స్థానికులు, క్రీడాకారులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయనకు ఇద్దరు పిల్లలు దుర్గా భవానీ, దుర్గా కుమార్‌లు ఉన్నారు. వీరు క్రికెట్‌లో స్టేట్‌ ప్లేయర్స్‌గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం మంగళగిరి ప్రోబబుల్స్‌ మ్యాచ్‌లో కుమారుడు, గుంటూరులో అండర్‌ –19 క్రికెట్‌లో కుమార్తె ఆడుతున్నారు. తండ్రి మృతిచెందారన్న సమాచారాన్ని వారికి పోలీసులు అందించారు. గత కొంతకాలం కిందటే ఆయన భార్య మృతిచెందింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 

అసలేం జరిగింది...
ఎప్పటిలాగా వేకువజాము అయింది. క్రీడాకారులందరూ అయోధ్యామైదానానికి క్రికెట్, షటిల్‌ వంటి క్రీడలు ఆడుకునేందుకు తరలివస్తున్నారు. వారందరూ ఒక్కసారిగా హతాశయులయ్యారు.  మంచంపై విగతజీవిలా పడిఉన్న పెంటయ్యను చూసి నిశ్చేష్టులయ్యారు. మృతుడి శరీరంపై దెబ్బలు చూసి వెంటనే టూటౌన్‌ పోలీసులకు సమాచారమందించారు. అక్కడ రాత్రి వాచ్‌మేన్‌గా విధులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తితో పాటు రాత్రి ఆ గదిలో ఏం జరిగిందనే విషయం పై స్పష్టతనివ్వలేదు. ముగ్గురూ కలిసి మద్యం సేవించి తగాదా పడ్డారా? ఆ తగాదాలో ఏమైనా గట్టిగా దెబ్బ తగలడంతో మృతిచెందాడా? లేక మృతుడి దగ్గర ఉన్న రూ.20 వేలును కాజేసేందుకేనా ఇదంతా చేశారా? లేక ఇతరత్రా కారణాలున్నాయా? అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గదిలో హత్య జరిగిన తర్వాత తామేమీ ఎరగనట్టు గదిలోంచి  మృతదేహాన్ని బయటకు తీసేసి మంచంపై పడేయడంతో పాటు ఆ ప్రాంతాన్ని శుభ్రంగా కడిగేయడం, బయట పెంకులు ముక్కలై ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

పూర్తి విచారణ చేపట్టాం
విచారణ కొనసాగుతోంది. గ్రౌండ్‌మన్‌ అసిస్టెంట్‌తో పాటు క్రికెట్‌ ప్రాక్టీస్‌కి వస్తున్న మరో వ్యక్తిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. వారిద్దరిని విచారించిన తర్వాత పూర్తిస్థాయి వివరాలు అందజేస్తాం. మృతుని శరీరంపైన తీవ్రగాయాలున్నాయి. పెంకులతో కొట్టినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడికి మద్యం సేవించే అలవాటు ఉంది. ఎపుడూ బల్లపైన పడుకుంటాడు. మృతదేహం కిందపడి ఉంది. సంఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగి ఉంటుందని భావిస్తున్నాం. దీనిపైన పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటాం.
–బి.రాజకుమారి, ఎస్పీ, విజయనగరం

మరిన్ని వార్తలు