గుల్జార్‌ ఖాన్ @గూగుల్‌ వాయిస్‌!

3 Jan, 2020 11:47 IST|Sakshi

పాకిస్తాన్‌లోని పరివారాన్ని సంప్రదించింది ఇలా

‘సిట్‌’ విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడి  

కర్నూలులోనూ సిటీ పోలీసుల దర్యాప్తు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళను ప్రేమించి భారత్‌లోకి దొడ్డిదారిన అడుగు పెట్టిన పాకిస్తానీ గుల్జార్‌ ఖాన్‌ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పాకిస్తాన్‌లో పుట్టి పెరిగి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ.. ఫోన్‌ ద్వారా పరిచయమైన ఆమె కోసం కర్నూలు చేరుకుని.. పదకొండేళ్ల తర్వాత సొంత గడ్డపై మమకారంతో కుటుంబంతో సహా తిరిగి వెళ్లాలని ప్రయాణమైన ఇతడిని ఇటీవల నగరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. సిట్‌ అధికారుల విచారణలో గుల్జార్‌ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పినట్టు సమాచారం.

సాక్షి, హైదరాబాద్‌: పాకిస్తాన్‌లో పుట్టి పెరిగి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ.. ఫోన్‌ ద్వారా పరిచయమైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ కోసం దొడ్డిదారిన దేశంలోకి అడుగు పెట్టాడు. అయితే పదకొండేళ్ల తర్వాత సొంత గడ్డపై మమకారంతో కుటుంబంతో సహా తిరిగి వెళ్లాలని భావించాడు. పాక్‌లోని సియాల్‌కోట్‌ జిల్లాలో ఉన్న తన పరివారాన్ని పట్టుకోవడానికి గూగుల్‌ వాయిస్‌ను వినియోగించాడు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ మీదుగా ఆ దేశానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ గత నెలలో హైదరాబాద్‌లో పోలీసులకు చిక్కాడు. పాకిస్తానీ షేక్‌ గుల్జార్‌ ఖాన్‌ వ్యవహారమిదీ. అతడిని కస్టడీలోకి తీసుకున్న సిట్‌ అధికారులు వివిధ కోణాల్లో విచారించగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

హరిద్వార్‌ వాసిగా భారత్‌కు..
పాకిస్తాన్‌లోని కుల్వాల్‌ ప్రాంతానికి చెందిన గుల్జార్‌ ఖాన్‌ 2004లో దుబాయ్‌లో నివాసం ఉండేవాడు. ఆ సమయంలో ఓ రోజు తనకు పొరపాటుగా వచ్చిన మిస్డ్‌ కాల్‌కు స్పందించి కాల్‌ బ్యాక్‌ చేశాడు. అలా కర్నూలు జిల్లా గడివేములకు చెందిన దౌలత్‌బీతో పరిచయం ఏర్పడింది. అప్పటికే దౌలత్‌కు వివాహం కాగా.. భర్త అనారోగ్యంతో చనిపోయాడు. దౌలత్‌తోపరిచయం ప్రేమకు దారి తీయడంతో గుల్జాన్‌ భారత్‌కు వచ్చేందుకు 2008లో సౌదీ వెళ్లాడు. తాను హరిద్వార్‌ నుంచి హజ్‌ యాత్రకు వచ్చానని, తన పాస్‌పోర్ట్‌ సహా డాక్యుమెంట్లు పోయాయని అక్కడి ఎంబసీలో ఫిర్యాదు చేశాడు. గుల్జార్‌కు ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ (ఈసీ) జారీ చేసిన అధికారులు విమానంలో ముంబైకి పంపారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అతగాడు దౌలత్‌బీని వెతుక్కుంటూ కర్నూలు మీదుగా గడివేముల చేరుకున్నాడు.ఆమెను కలుసుకున్న గుల్జార్‌ వివాహం చేసుకోవడంతోపాటు పెయింటర్‌గా అక్కడే స్థిరపడ్డాడు. తాను భారతీయుడినే అంటూ ఆధార్, ఓటర్‌ ఐడీ తదితరాలను పొందాడు. ప్రస్తుతం గుల్జార్‌–దౌలత్‌లకు నలుగురు సంతానం. 

కుమారుడి సలహాతో..  
కుల్వాల్‌లో నివసిస్తున్న గుల్జార్‌ కుటుంబం ఆర్థికంగా స్థిరపడిందే. ఇతడి ఇద్దరు సోదరీమణులు వైద్యులుగా పనిచేస్తున్నారు. భార్యాపిల్లలతో గడివేములలో ఉంటున్న గుల్జార్‌కు టీబీ సోకింది. దీంతో ఏ పనిచేయలేకపోతున్న అతను స్వదేశానికి వెళ్లిపోయి కుటుంబంతో కలిసి బతకాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడి కుమారుడు గూగుల్‌ వాయిస్‌ విషయం చెప్పాడు. తాను టీవీలో ఒక వాణిజ్య ప్రకటన చూశానని, అందులో గూగుల్‌ వాయిస్‌ వాడే విధానం ఉందని వివరించాడు. దీంతో ఓ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసిన గుల్జార్‌ గూగుల్‌ వాయిస్‌లో తన ఊరు పేరు చెప్పాడు. సియాల్‌కోట్‌లోని కుల్వాల్‌ వివరాలు చూపించిన గూగుల్‌.. అక్కడి ఓ వస్త్రదుకాణం బోర్డును చూపించింది. ఆ బోర్డుపై ఉన్న ఫోన్‌ నంబర్‌ను సంప్రదించిన గుల్జార్‌ తనతోపాటు కుటుంబం వివరాలు చెప్పి, తన తల్లి షరీఫాబీతో మాట్లాడించాలని కోరుతూ వారికి తన నంబర్‌ ఇచ్చాడు. అనంతరం వీరి మధ్య సంప్రదింపులు మొదలయ్యాయి.

కర్తార్‌పూర్‌ మీదుగా వెళ్దామని..
భారత్‌ నుంచి పాస్‌పోర్ట్, వీసాతో పాకిస్తాన్‌కు వచ్చి ఉండిపోవడం కష్టమని, దీని కంటే పంజాబ్‌లోని కర్తార్‌పూర్‌ కారిడార్‌ మీదుగా అడ్డదారిలో రావాలని సోదరుడు షాజీద్‌ సలహా ఇచ్చాడు. దీంతో ఢిల్లీ మీదుగా కర్తార్‌పూర్‌ వెళ్లేందుకు కర్నూలు నుంచి రైలులో గత నెలలో కుటుంబంతో సహా హైదరాబాద్‌ వచ్చాడు. అప్పటికే ఇతడి వ్యవహారాన్ని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించి హైదరాబాద్‌ సిట్‌ పోలీసులకు సమాచారం అందించాయి. దీంతో సిట్‌ బృందం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద వీరిని పట్టుకుంది. గుల్జార్‌ను అరెస్టు చేసిన పోలీసులు దౌలత్‌బీ తదితరులను విడిచిపెట్టారు. కోర్టు అనుమతితో గుల్జార్‌ను ఇటీవల కస్టడీలోకి తీసుకున్నసిట్‌ పోలీసులు అతడిని వివిధ కోణాల్లో విచారించారు. సిటీ నుంచి కర్నూలు తీసుకెళ్లి పలు రికార్డులు స్వాధీనం చేసుకుని వచ్చారు. ఇతడి నుంచి గడివేములలో తీసుకున్న గుర్తింపుకార్డులు, పాస్‌పోర్ట్‌ స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు