వెలుగులోకి వస్తున్న దీప్తి మోసాలు!

19 Oct, 2019 11:43 IST|Sakshi
డబ్బు తీసుకున్న సమయంలో బాధితుడికి దీప్తి అందజేసిన ఖాళీ చెక్కు

సాక్షి, గుంటూరు: ఖరీదైన కారులో విలాసవంతంగా తిరుగుతూ నిరుద్యోగులు, అమాయకులను నమ్మించి ఘరానా మోసాలకు పాల్పడిన మామిళ్లపల్లి దీప్తి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాను సీఎంవోలో పీఏగా పనిచేస్తున్నానంటూ ఇప్పటికే రూ.70 లక్షలను వివిధ రకాల ఉద్యోగాలు, సమస్యలు పరిష్కరిస్తానంటూ కాజేసిన విషయం తెలి సిందే. ‘సాక్షి’లో ప్రచురితమవుతున్న వరుస కథనాలతో బాధితులు బయటకు వస్తున్నారు. వారిని నమ్మించి మోసం చేసిన విషయాలను ఏకరువు పెడుతున్నారు. నిందితురాలిని పోలీసులు వీలైనంత త్వరగా అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 

బాబాయి పేరుతో కారు...
ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేసి రిటైర్‌ అయి హైదరాబాదులో ఉంటున్న దీప్తి బాబాయి మామిళ్లపల్లి కృష్ణ ప్రసాద్‌ పేరుతో ఉన్న మారుతీ డిజైర్‌ కారును ఉపయోగిస్తుంది. కారుపై రిజిస్ట్రేషన్‌ నంబరు లేకుండా ‘ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ’ అని రాసుకొని దర్జాగా తిరిగింది. టీడీపీ హయాంలో ఎవరూ కారును నిలుపుదల చేసి కారు నంబరు విషయం అడిగే సాహసం చేయలేక పోయారు. గుంటూరులోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్న కారణంగా కారుకు గుంటూరులోని ఇద్దరు డ్రైవర్లను ఏర్పాటు చేసుకుంది. అయితే వారిలో ఓ డ్రైవర్‌కు గత నెలలో జీతం ఇవ్వకపోవడంతో మానేశాడు. ఇదిలా ఉంటే గుంటూరులోని ఓ బాధితుడికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.1.50 లక్షలు తీసుకున్న సమయంలో ఖాళీ చెక్కుపై ఎంత డబ్బు అనే వివరాలు రాయకపోగా, ఆమె సంతకం కూడా లేకుండా ఇచ్చేసిందంటే బాధితుడిని ఎలా మోసం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇదేంటి సంతకం లేదని బాధితుడు అడిగితే సంతకంతో పనేముంది నీకు హామీగా ఇస్తున్నానని నమ్మబలికిందని వాపోతున్నాడు.
 
రంగంలోకి దిగిన పచ్చ సీఐ..
ఈ నేపథ్యంలో దీప్తి మోసాల గురించి వస్తున్న కథనాలతో ఆందోళనకు గురైన కొందరు బాధితులు కాకుమాను మండలంలోని మోసకారి గ్రామమైన బోడపాలెం వెళ్లి ఆరా తీశారు. కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న దీప్తి టీడీపీ నాయకులతో మంతనాలు చేసినట్లు తెలిసింది. వారి సూచనల మేరకు పచ్చ రంగు పులుముకున్న ఓ సీఐ రంగంలోకి దిగి దీప్తి గ్రామానికి ఎందుకు వెళ్లి విచారించారంటూ బాధితులకు ఫోన్‌ చేసి హెచ్చరించారు. ఇకపై అటువెళితే సహించేది లేదని, ఏదైనా ఉంటే దీప్తి పైనే ఫిర్యాదు చేసుకోవాలని ఆదేశించారు. నిందితురాలికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలను ముందుగా నిలుపుదల చేసి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. (చదవండి: కిలాడీ లేడీ దీప్తీ)

మరిన్ని వార్తలు